Begin typing your search above and press return to search.

పవన్ యాక్షన్ ప్లాన్ పై నీళ్లు చల్లారు

By:  Tupaki Desk   |   2 Nov 2019 10:03 AM GMT
పవన్ యాక్షన్ ప్లాన్ పై నీళ్లు చల్లారు
X
ఒకే దెబ్బకు చాలా పిట్టలు సామెత అమలు చేయాలని యోచించిన జనసేనానికి గట్టి దెబ్బతగిలిందా..? లాంగ్ మార్చ్ తో ఏపీలోని పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్లాన్ బెడిసికొట్టిందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ వర్సెస్ జనసేనతోపాటు మిగతా పార్టీలన్నింటిని మహాకూటమిగా చేయాలన్న జనసేనానికి చుక్కెదురైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

నవంబర్ 3న జనసేనాని పవన్ విశాఖలో తలపెట్టిన 'లాంగ్ మార్చ్' ద్వారా ఏపీలోని ఇసుక కొరతను ఎలుగెత్తి చాటడానికి పూనుకున్నారు. అయితే పవన్ చేపట్టిన ఈ నిరసన వెనుక అసలైన రాజకీయ వ్యూహం కూడా ఉందని పార్టీలన్నీ అనుమానించాయి. లాంగ్ మార్చ్ కేవలం ఇసుక కొరతపై మాత్రమే కాదని.. ఏపీలోని పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి వైసీపీపై పోరాటం చేయడం ముఖ్య ఉద్దేశమని భావించారట.. పవన్ కళ్యాణ్ పన్నిన ద్విముఖ వ్యూహాన్ని ఏపీలోని పార్టీలన్ని గ్రహించి తప్పుకోవడంతో ఇప్పుడు పవన్ ప్లాన్ బెడిసికొట్టింది. ఒంటరిగా మారిపోయారు.

పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ముందుగా బీజేపీ ఈ లాంగ్ మార్చ్ కు సంఘీభావం తెలిపింది. అయితే ఆ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫ్టేట్ ఫిరాయించాడు. తమ మద్దతు కేవలం ఈ ఇసుక ఆందోళనకే కానీ.. జనసేనకు కాదని క్లారిటీ ఇచ్చారు. జనసేన లాంగ్ మార్చ్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అనుమానించిన బీజేపీ ఇలా పవన్ కు షాకిచ్చిందన్న చర్చ మొదలైంది.

అయితే బీజేపీని లాంగ్ మార్చ్ కు ఆహ్వానించడం వామపక్షాలకు కోపం తెప్పించింది. పవన్ తో ఇన్నాళ్లు కలిసి నడిచిన వారు బీజేపీని ఆహ్వానించడంతో నొచ్చుకొని లాంగ్ మార్చ్ కు తాము హాజరుకాలేమంటూ పవన్ లేఖ రాసి షాకిచ్చాయి.

ఇక పవన్ తో సన్నిహితంగా మెలుగుతున్న చంద్రబాబు జనసేన లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించారు. టీడీపీ ముఖ్యనేతలు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఇలా బీజేపీ, వామపక్షాలు యూటర్న్ తీసుకోవడంతో పవన్ తన పాత మిత్రుడు టీడీపీ మాత్రమే లాంగ్ మార్చ్ లో మిగిలాయి. అందరినీ గాటునకట్టి వైసీపీపై యుద్ధం చేస్తామని పవన్ యోచిస్తే అది పార్టీలు పసిగట్టి దూరం జరిగాయన్న చర్చ సాగుతోంది.