Begin typing your search above and press return to search.

సానియా ట్వీట్ పై ఫేస్ ఈ రేంజ్లో స్పందించాడు!

By:  Tupaki Desk   |   20 Sep 2016 5:39 AM GMT
సానియా ట్వీట్ పై ఫేస్ ఈ రేంజ్లో స్పందించాడు!
X
ఇప్పటికే ముదిరి ముదిరి పాకాన పడుతున్న భారత టెన్నీస్ వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఫేస్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సానియా.. ఒక విషపురుగు అంటూ ఫేస్ ను పరోక్షంగా విమర్శించిన అనంతరం - భారత టెన్నీస్ దిగ్గజం లియాండర్ ఫేస్ కుడా మాటల్లో వేడి పెంచాడు. ఈసారి మరింత వాడిగా మాటల తూటాలు పేల్చుతూ తాను సాధించిన ఘనతలు సాధించాలంటే వారికి జీవితకాలం పడుతుందని చెబూతూ మరింతగా - మొరిగేవాళ్లను మొరగనివ్వండి అంటూ రెచ్చిపోయాడు.

తన సుదీర్ఘ కెరీర్లో సహచర క్రీడాకారులు చాలామందికి తనపై విపరీతమైన అసూయ అని.. 7 ఒలింపిక్స్‌ లో పాల్గొనడానికి - 18 గ్రాండ్‌ స్లామ్‌ లు గెలవడానికి ఎంత కష్టపడాలనేది అలాంటివారికి అర్ధం కాదని.. వారిలో కొందరు పది జన్మలు ఎత్తినా ఈ ఘనతలు సాధించలేరని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అక్కడితో ఆగని ఫేస్ "మొరిగేవాళ్లను మొరగనివ్వండి.. ద్వేషించే వాళ్లను ద్వేషించనివ్వండి.. వాళ్ల గురించి నేను పట్టించుకోను. జనాలు నమ్మినా నమ్మకపోయినా.. మీడియా వాళ్లు రాసినా రాయకపోయినా.. నా పేరును చరిత్ర పుస్తకాల్లో చూస్తారు.. చరిత్ర పుస్తకాల్లో లిఖించుకుంటాను" అని స్పందించాడు.

ఇదే సమయంలో డబ్బు కోసమే ఆటలో కొనసాగుతున్నాడు అనే విమర్శలపై కూడా ఫేస్ స్పందించాడు. కోచ్‌ లకు - ప్రయాణాలకు కలిపి ఏడాదికి రూ.3 కోట్ల దాకా ఖర్చవుతుందని, సింగిల్స్‌ తో పోలిస్తే ప్రైజ్‌ మనీ చాలా తక్కువని.. పైగా ఆ డబ్బు పార్ట్నర్ తో పంచుకోవాలని.. దీనివల్ల తాను మరింతగా నష్టపోతున్నాని.. ఆటంటే ఇష్టం కాబట్టే కొనసాగుతున్నా తప్ప డబ్బు కోసం కాదని అని పేస్ స్పష్టం చేశాడు. ఆట వదిలేసి వ్యాఖ్యాతగా మారినా.. అకాడమీ నడిపినా ఇంతకంటే ఎక్కువే సంపాదిస్తానని ఫేస్ తెలిపాడు.

కాగా.... గత రెండు ఒలింపిక్స్ కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అత్యుత్తమ జోడీని డబుల్స్ కు పంపలేకపోయామని అనడంపై స్పందించిన సానియా.. పేస్ ను నేరుగా ప్రస్తావించకుండానే ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడంతో సమానమని పరోక్షంగా పేస్‌ ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఈ వ్యవహారం ఇంకెంతదూరం వెలుతుందో చూడాలి మరి!!