Begin typing your search above and press return to search.

సబ్జెక్ట్ నేర్చుకో షర్మిల అక్క.. ట్రోల్సే ట్రోల్స్!

By:  Tupaki Desk   |   31 March 2021 1:35 PM GMT
సబ్జెక్ట్ నేర్చుకో షర్మిల అక్క.. ట్రోల్సే ట్రోల్స్!
X
విడిచిన బాణం, వదిలిన మాట ఎప్పటికీ తిరిగిరాదు. అందుకే నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏదైనా తప్పుగా మాట్లాడారో నెటిజన్లకు దొరికేస్తారు.. 'బ్రహ్మానందం' ఫొటోలు పెట్టి నేతలను ట్రోల్స్ తో చంపేస్తారు. అలాంటి బాధితుడే మన చంద్రబాబు కుమారుడు లోకేష్. ఎన్నోసార్లు తన భాష పటిమతో నెటిజన్లకు పనిచెప్పిన యోధుడాయన..ఇప్పుడా వరుసలో వైఎస్ షర్మిల సైతం చేరబోతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగనన్న వదిలిన బాణం కూడా ఇప్పుడు ఓ మాట చెప్పి బుక్కైంది.

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా మహబూబ్ నగర్ నేతలతో సమావేశమయ్యారు. ఆమె ఎప్పుడో ఉమ్మడి ఏపీలో జగన్ జైల్లో ఉండగా చేసిన పాదయాత్ర సమయంలో 'మహబూబ్ నగర్ 'లో పర్యటించారు. నాటి వలసలను చూశారు. అదే కోవలో నేడు 'పాలమూరు బొగ్గుబాయి, ముంబై, దుబాయ్' అంటూ మహబూబ్ నగర్ లో ఉందని విమర్శించారు.

నిజానికి తెలంగాణ ఏర్పడ్డాక మహబూబ్ నగర్ ఒడ్డున పారుతున్న కృష్ణా నదిపై ఎక్కడికక్కడ ఎత్తిపోతలు పెట్టి జిల్లాను సస్యశ్యామలం చేసింది కేసీఆర్ సర్కార్. కరువు తీరా కృష్ణా నీళ్లు ఇస్తోంది. దీంతో వలస పోయిన ప్రజలంతా ఇప్పుడు వచ్చి మహబూబ్ నగర్ లో వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తున్నారు. కానీ ఆ విషయం తెలియని షర్మిల ఇంకా మహబూబ్ నగర్ ను వలసలతో పోల్చారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు, నెటిజన్లకు చిక్కారు. కరువు తీరిన మహబూబ్ నగర్ ను చూడు అని వాళ్లు ఫొటోలు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక మరో విషయంలోనూ షర్మిల అడ్డంగా బుక్కయ్యారు. 'కోహీనూర్ జన్మస్థలం మహబూబ్ నగర్ అని అలాంటి జిల్లా వలసల బారిన పడిందని విమర్శించారు. నిజానికి కోహినూర్ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కొల్లూరులో.. అది ఏ పిల్లాడిని అడిగినా చెప్తారు. కానీ వైఎస్ షర్మిలకు దీనిపై తెలియకపోవడంతో నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో 'కోహినూర్ షర్మిల' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంత చిన్న విషయం తెలియదా అంటూ ఇప్పుడు కోహినూర్ వజ్రంపై షర్మిల గురించి సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. అందుకే అంటారు.. నేతలకు సబ్జెక్ట్ , భాష పరిజ్ఞానం లేకుంటే రాజకీయాల్లో నెగ్గడం ఎంత కష్టమో అని..