Begin typing your search above and press return to search.

సామాన్యుడి ధర్మాగ్రహమే సత్యం కూసాలు కదిలాయి

By:  Tupaki Desk   |   10 April 2015 5:43 AM GMT
సామాన్యుడి ధర్మాగ్రహమే సత్యం కూసాలు కదిలాయి
X
అంతర్జాతీయంగా పేరొందిన ఒక వ్యక్తి.. భారత ఐటీలో మేరునగంగా చెప్పుకునే వ్యక్తిని కటకటాల వెనుక పడేలా చేయటమే కాదు.. ఒక పెద్ద కంపెనీ కూసాలు కదిలిపోయేలా చేసింది ఒక సామాన్య వ్యక్తి అంటే చాలామంది నమ్మలేరు. కానీ.. ఇది నిజం. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కాస్తా మహేంద్ర సత్యంగా మారిపోవటానికి.. అంతర్జాతీయంగా పేరొందిన సత్యం రామలింగరాజు సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి.. ఆ కంపెనీకి చెందిన ప్రముఖులు జైళ్లల్లో మగ్గటానికి ఒక కామన్‌మ్యాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం సంస్థ కూసాలే కదిలిపోయిన పరిస్థితి.

సత్యం కుంభకోణంలో పాత్రధారులైన రామలింగరాజు తదితరులు తప్పు చేశారని.. వారంతా నమ్మకద్రోహానికి పాల్పడటమే కాదు.. భారీ ఆర్థిక నేరాన్ని చేశారని నిర్ధారిస్తూ.. ఏడేళ్లు జైలు శిక్ష భారీ జరిమానాను విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వటం తెలిసిందే.

ఈ శిక్ష విన్న వారంతా కొద్దిపాటి షాక్‌ తిన్న పరిస్థితి. ఆర్థికనేరాల్ని కోర్టులు ఎంత సీరియస్‌గా తీసుకుంటాయన్న విషయం మరోసారి నిరూపితమైంది. సత్యం రామలింగరాజు అండ్‌ కో మీద అసలు కేసు పెట్టింది ఎవరు? ఎవరి కారణంగా ఇంత పెద్ద వ్యవహారం జరిగిందని చూస్తే.. చిన్నపాటి ఆశ్చర్యం కలుగక మానదు.

సత్యం కంపెనీ మీదా.. దాని ప్రయోటర్లు.. డైరెక్టర్లు దోషులుగా నిలవటానికి ఆ కంపెనీకి సంబంధించి వంద షేర్లు ఉన్న ఒక మహిళే కారణం కావటం గమనార్హం. లీనా మంగత్‌ అనే మహిళ సిండికేట్‌ బ్యాంక్‌ నుంచి రిటైర్‌ అయ్యారు. తన రిటైర్మ్‌ంట్‌ బెనిఫిట్స్‌గా వచ్చిన సొమ్ములో రూ.19,000లతో వంద షేర్లు కొన్నారు. సత్యం కుంభకోణం బయటపడటానికి నాలుగేళ్ల ముందు ఆమె ఈ షేర్లు కొనుగోలుచేశారు.

అయితే.. సత్యం కంప్యూటర్స్‌లో చోటు చేసుకున్న కుంభకోణంతో ఆమె పెట్టిన రూ.19000 కాస్తా.. రూ.500పడిపోవటాన్నిజీర్ణించుకోలేని ఆమె.. 2009 జనవరి 11న హైదరాబాద్‌ డీజీపీ ఆపీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ప్రమోటర్లు.. డైరెక్టర్ల మోసాల కారణంగా తన పెట్టుబడి మొత్తంగా నష్టపోయానని.. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీసీఐడీ సత్యం కంప్యూటర్స్‌ సంస్థ ప్రమోటర్లు.. డైరెక్టర్ల మీద ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అలా మొదలైన ఈ కేసు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్‌ 09, 2015 నాటి ఏడేళ్ల తీర్పుతో ఒక అధ్యాయం ముగిసింది. తప్పు చేసిన అంత పెద్ద బిజినెస్‌మ్యాన్‌ని జైల్లో పడేలా చేసింది.