Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర అసెంబ్లీలోకి నిమ్మ‌కాయ‌ల‌కు నో ఎంట్రీ!

By:  Tupaki Desk   |   5 July 2019 5:54 AM GMT
ఆ రాష్ట్ర అసెంబ్లీలోకి నిమ్మ‌కాయ‌ల‌కు నో ఎంట్రీ!
X
మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాలుతాయో లేదో కానీ.. న‌మ్మ‌కాల విష‌యంలో మాత్రం క‌ర్ణాట‌క అసెంబ్లీ అనుస‌రిస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అసెంబ్లీలోకి ఆయుధాలు.. ప‌దునైన వ‌స్తువులు.. సిగిరెట్లు.. గుట్కా.. లాంటి నిషేధిత వ‌స్తువుల్ని తీసుకెళ్ల‌టం రోటీన్. తాజాగా క‌ర్ణాట‌క అసెంబ్లీలోకి ప్ర‌జాప్ర‌తినిధులు నిమ్మ‌కాయ‌లు తీసుకెళ్ల‌టంపై నిషేధాన్ని విధించారు.

తాజాగా క‌ర్ణాట‌క విధాన‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల‌కు హాజ‌రైన ప్ర‌జాప్ర‌తినిధుల్ని తనిఖీ చేస్తున్న భ‌ద్ర‌తా సిబ్బంది వారి నుంచి కొన్ని వ‌స్తువుల్ని వెంట తీసుకెళ్లేందుకు నో చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నేత‌ల జేబుల్లో ఉన్న నిమ్మ‌కాల్ని స‌భ‌లోకి తీసుకెళ్లేందుకు అనుమ‌తించ‌ని వైనం చోటు చేసుకుంది.

త‌మ ఆరోగ్యం బాగోలేద‌ని.. అందుకు మ‌ధ్య మ‌ధ్య‌లో నిమ్మ‌కాయ వాస‌న చూడాల‌ని కొంద‌రు.. మ‌ధ్య‌లో నిమ్మ‌కాయ ర‌సం తాగేందుకు వీలుగా నిమ్మ‌కాయల్ని తీసుకెళుతున్న‌ట్లు చెబుతున్నా.. భ‌ద్ర‌తా సిబ్బంది మాత్రం నో చెబుతున్నార‌ట‌.

నేత‌ల‌కే కాదు.. ఉద్యోగులు.. విజిట‌ర్స్ ఎవ‌రైనా స‌రే.. వారి దగ్గ‌ర నిమ్మ‌కాయ ఉంటే మాత్రం వాటిని తీసుకొని చెత్త కుండీల్లో ప‌డేస్తున్నార‌ట‌. ఎందుకిలా అంటే? మూఢ న‌మ్మ‌కాలే కార‌ణ‌మంటున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో కర్ణాట‌కలో కొన్ని న‌మ్మ‌కాలు ఎక్కువ‌. చేత‌బ‌డి..లాంటివి చేసే అవ‌కాశం ఉంద‌ని.. అందుకోసం నిమ్మ‌కాయ‌లు వాడుతుంటార‌ని.. మంత్రించిన నిమ్మ‌కాయ‌ల్ని మంత్రుల ఛాంబ‌ర్ల‌లో వేస్తార‌న్న భ‌యంతోనే నిమ్మ‌కాయ‌ల్ని అనుమ‌తించ‌టం లేదంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సోద‌రుడు.. రాష్ట్ర మంత్రి రేవ‌ణ్ణ చేతిలో ఉండే నిమ్మ‌కాయ‌కు మాత్రం సెక్యురిటీ సిబ్బంది మాత్రం నో చెప్ప‌టం లేద‌ట‌. అంద‌రికి వ‌ర్తించే నిషేధం సీఎం సోద‌రుడికి వ‌ర్తించ‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు.