Begin typing your search above and press return to search.

లంచం ఇస్తే..ఉగ్ర‌వాది అయినా త‌ప్పించుకోవ‌చ్చు!

By:  Tupaki Desk   |   21 Sep 2017 12:00 PM GMT
లంచం ఇస్తే..ఉగ్ర‌వాది అయినా త‌ప్పించుకోవ‌చ్చు!
X
దేశంలో అవినీతిని క‌డిగిపారేస్తామ‌ని మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఘ‌నమైన హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన మోదీ... ఆ త‌ర్వాత మోదీని మెప్పించి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన యోగీ ఆదిత్య‌నాథ్... ఆ ప‌నిని ముందుకు తీసుకెళ్లేందుకు శ్ర‌మిస్తూనే ఉన్నారు. అయితే వీరి శ్ర‌మ‌ను బూడిద‌లో పోసిన ప‌న్నీరులా చేసేసిన ఓ ఖాకీ తీరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింద‌నే చెప్పాలి. ఓ వైపు దేశంలోకి నిత్యం చొర‌బాట్ల‌కు య‌త్నిస్తున్న ఉగ్ర‌వాదుల‌ను ఏరివేసేందుకు వేలాది మంది భార‌త సైనికులు రాత్రింబ‌వ‌ళ్ల‌నే తేడా లేకుండా ప్రాణాల‌కు తెగించి మ‌రీ పోరు సాగిస్తున్నారు. అదే స‌మ‌యంలో మిగిలిన ఏ త‌ర‌హా నేరాల‌నైనా కాస్తంత చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హరిస్తున్నా... దేశానికే పెను ముప్పుగా ప‌రిణ‌మిస్తున్న ఉగ్ర‌వాదుల విష‌యంలో మాత్రం అన్ని రాష్ట్రాల‌కు చెందిన పోలీసులు క‌ఠిన వైఖ‌రినే అవ‌లంబిస్తున్నారు.

ఈ క్ర‌మంలో దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్త‌ర‌ప్రదేశ్ కు చెందిన పోలీసు శాఖ‌లో వెలుగు చూసిన ఓ అంశం ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసుల ప‌రువును కూడా తీసేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా యావ‌త్తు దేశ పోలీసుల‌కే మ‌చ్చ తెచ్చేలా ఉన్న ఆ ఘ‌ట‌న ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... డ‌బ్బుకు క‌క్కుర్తి ప‌డ్డ ఓ సీనియ‌ర్ పోలీసు అధికారి ఏకంగా ఉగ్ర‌వాదిగా ముద్ర‌ప‌డ్డ ఓ నిందితుడు జైలు నుంచి పారిపోయేందుకు స‌హ‌క‌రించారు. ఇందుకోసం ఆ పోలీసు అధికారి ఏకంగా రూ.45 ల‌క్ష‌ల‌ను త‌న జేబులో వేసుకున్నాడ‌ట‌. ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. గోపీ ఘనశ్యాంపుర అనే ఖలిస్తాన్ టెర్రరిస్టు హై సెక్యూరిటీ ఉన్న నభా జైలు నుంచి తప్పించుకుని గతేడాది పారిపోయాడు. ప‌క‌డ్బందీ భ‌ద్ర‌త ఉన్న ఈ జైలు నుంచి స‌ద‌రు ఉగ్ర‌వాది త‌ప్పించుకుని పారిపోవ‌డం వెనుక ఓ సీనియ‌ర్ పోలీసు అధికారి హస్తం ఉందని యూపీ - పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అధికారికి - ఉగ్రవాదికి మధ్య కుదిరిన డీల్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ను పంజాబ్ పోలీసులు యూపీ ప్రభుత్వానికి అందజేశారు.

ఈ వైనంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. గోపీ ఘనశ్యాంపుర చివరిసారి గత సెప్టెంబరు 10 న షాహజాన్ పురలో కనిపించాడని, ఆ తరువాత అతని జాడ లేదని పంజాబ్ పోలీసులు అంటున్నారు. అనంతరం పట్టుబడి నభా జైలుకు తరలించినప్పటికీ, సిబ్బంది కళ్ళు గప్పి పరారయ్యాడన్నారు. అతని విడుదలకు ఓ ఐజీ స్థాయి అధికారి కోటి రూపాయలు డిమాండ్ చేశాడని, అయితే డీల్ చివరకు 45 లక్షలకు కుదిరిందని తెలిసింది. ఈ వ్యవహారంలో సందీప్ తివారీ అలియాస్ పింటూ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్య‌వ‌హారంపై అటు కేంద్ర హోం శాఖ కూడా ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప‌రారైన ఖైదీ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చినా... అత‌డు పారిపోయేందుకు స‌హ‌క‌రించిన పోలీసు అధికారి పేరు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు.