Begin typing your search above and press return to search.

చంపేసి మృతదేహాలతో కేకులు - బిస్కెట్ల తయారీ

By:  Tupaki Desk   |   4 April 2020 12:30 AM GMT
చంపేసి మృతదేహాలతో కేకులు - బిస్కెట్ల తయారీ
X
కొన్ని నేరాలు దారుణంగా ఉంటాయి. చిత్రవిచిత్రంగా ఉండి ప్రజలను భయాందోళనకు గురి చేసేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మృతదేహాలతో కొందరు ఆటలాడుకుంటారు. అలాంటి సంఘటనలు ఎన్నో చదివాం.. చూశాం. కానీ ఒక మహిళ మనుషులను దారుణంగా హత్య చేసి ఆ మృతదేహాలతో కేకులు - బిస్కెట్లు తయారుచేసి వాటిని ఇతరులకు తినిపించిన దారుణ సంఘటన వివరాలు దాదాపు దశాబ్దాల తర్వాత వెలుగులోకి వచ్చింది. మనుషుల మృతదేహాలతో ఓ బేకరీ నిర్వాహకురాలు తన వంటకు వినియోగించుకోవడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ సంఘటనలు ఇటలీలో 1939-40 సంవత్సరాల మధ్య చోటుచేసుకున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది.

ఇటలీలోని కోరేజియోలో నివసిస్తున్న లియోనార్డా సియాన్సియుల్లి సబ్బులు - కేకుల తయారీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దీంతో ఆమెకు ఆ ప్రాంతంలో ఎంతోమంది పరిచయమయ్యారు. ఆమెతో అందరూ సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆమె సడన్‌ గా ముగ్గురుని హతమార్చిన విషయం ఆలస్యంగా ఆ దేశ పోలీసులు కనిపెట్టారు. ముగ్గురు మహిళలు అదృశ్యమైన కేసుల్లో భాగంగా విచారణ చేస్తుండగా లియోనార్డ సియాన్సియుల్లి పేరు వినిపించడంతో విచారణ చేయగా ఆమె మూడు దారుణహత్యలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఆమె చేసిన ఘటనలు ఇవే..

- ఫౌస్టినా సెట్టీ అనే యువతికి పెళ్లి కాలేదు. ఆమె ఎంతో సన్నిహితంగా ఉంటుండడంతో లియోనార్డ సియాన్సియుల్లి నీకు భర్తను వెతుకుతున్నా అని చెప్పేది. ఈ క్రమంలో ఓ రోజు నీకు భర్తను వెతికాను.. ఇంటికి రావాలని ఆమెను కోరింది. దీంతో ఆమె ఇంటికి ఫౌస్టినా వెళ్లింది. ఈ సందర్భంగా జ్యూస్ ఇచ్చి మర్యాద చేసింది. కొంతసేపటికి ఆమె స్పృహ తప్పింది. ఎందుకంటే జ్యూస్‌ లో ఆమె మత్తు మందు కలపడంతో మత్తులోకి జారుకుంది. దీంతో ఫౌస్టినాను లోపలికి తీసుకువెళ్లి ఆమెను గొడ్డలితో హతమార్చింది. క్రూరంగా ఆమె శరీరాన్ని 9 భాగాలు చేసింది. అంతేకాకుండా హత్యచేయగా వచ్చిన రక్తాన్ని ఓ పెద్ద గిన్నెలో పట్టి పక్కనపెట్టింది. శరీరాన్ని ముక్కలుమక్కులుగా చేసి పెద్దకుండలో వేసింది. అనంతరం 7 కిలోల కాస్టిక్ సోడాను అందులో వేసి శరీర భాగాలన్నీ పూర్తిగా ఉడికించింది. అవి ఏకంగా పానకంలా తయారయ్యే వరకు చేసింది. అలా తయారైన రసాన్ని ఖాళీగా ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్‌ లో వేసి నిల్వ ఉంచింది. ఇక ఫౌస్టినా శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని బాగా ఎండబెట్టింది. ఎండిన ఆ రక్తంతో పిండి - చక్కెర - చాక్లెట్ - పాలు - కోడిగుడ్లు తదితరాలు కలిపి కేకు తయారు చేసింది. ఆ రక్తంతో కరకరలాడే టీ కేక్స్ తయారు చేసింది. వాటిని ఆమె ఇంటికి వచ్చిన వారికి వడ్డించింది. వారు తినేలా చేసింది. అయితే ఆమె కూడా తినడం గమనార్హం.

- అదే ప్రాంతానికి చెందిన ఫ్రాన్సెస్కా సోవీ అనే మహిళ నిరుద్యోగి. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి లియోనార్డ సియాన్సియుల్లి పిలిచింది. సేమ్‌ పై ఘటన మాదిరి జ్యూస్‌లో మత్తు కలిపి ఇచ్చి ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చింది. ఆమె శవాన్ని ముక్కలు చేసి కేకులు - సబ్బులు తయారు చేసింది.

- మూడో బాధితురాలు వర్జీనియా కాసియోప్పో. ఈమె చాలా అందగత్తె. శరీరం తెల్లగా.. అందంగా ఉంది. ఈ సందర్భంగా ఆమె చర్మంతో కేకులు తయారు చేయాలని భావించింది. దీంతో ఆమెను కూడా హతమార్చింది. ఆమెను హతమార్చేసి అనుకున్నట్లే ఆమె చర్మాన్ని ప్రత్యేకంగా వలిచి ఉడకబెట్టింది. కొవ్వునంతా కరిగించి వాటితో కేకులు తయారు చేసింది.

అయితే ఈ విషయాలు హత్యకు గురైన మహిళల కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. వారు అదృశ్యమయ్యారని ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వారి కోసం తీవ్రంగా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా అదృశ్యమైన మహిళల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారి ఇళ్లల్లో లియోనార్డ సియాన్సియుల్లికి సంబంధించిన లేఖలు కనిపించాయి. వాటిపై ఆమె అడ్రస్ కూడా రాసి ఉంది. ఆ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. మొదట ఆమె తటపటాయించగా అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా పై ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ హత్యోదంతాలు విన్న కోర్టు ఆశ్చర్యపోయింది. ఇన్ని చేసిన ఆమె ఏమాత్రం భయం.. బెరుకు లేకుండా నేరాలు అంగీకరించింది. పైగా మనుషుల మృతదేహాలతో గొప్ప వంటకం చేసినట్లుగా చెప్పుకుంది. దీంతో అందరూ షాక్‌ కు గురయ్యారు. దీంతో ఈ సంఘటనలను చూసి అందరూ ‘క్రేజీ సీరియల్ కిల్లర్ మదర్’ అని పిలుస్తున్నారు.