Begin typing your search above and press return to search.

గ్రేటర్ పోల్ : 400 ఏళ్ల చరిత్రగల భాగ్యనగరానికి ఇది సిగ్గుచేటు !

By:  Tupaki Desk   |   1 Dec 2020 12:28 PM GMT
గ్రేటర్ పోల్ :  400 ఏళ్ల చరిత్రగల భాగ్యనగరానికి ఇది సిగ్గుచేటు !
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ .. గత కొన్ని రోజులుగా భాగ్యనగర వాసులకి నిద్రలేకుండా చేసిన అతి ముక్యమైన అంశం. అన్ని పార్టీలు కూడా ఈ గ్రేటర్ ఎన్నికలని తమ పరువుగా భావించి , ప్రచారం నిర్వహించారు. ఎంతోమంది మహామహా నేతలు సైతం హైదరాబాద్ కి వచ్చి ప్రచారం చేసి , ఇతర పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు , విమర్శలు చేసి రాజకీయాన్ని వేడెక్కించారు కానీ, ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయలేకపోయారు. అందుకే గత 400 ఏళ్ల చరిత్రగల భాగ్యనగరానికి సిగ్గుచేటు ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 4 గంటల వరకు మొత్తంగా 29.76 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సమయం కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది.

పోలింగ్ శాతం ఇంత తక్కువగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్ కేంద్రాల వైపు చాలామంది అసలు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు.. ‘పోలింగ్ డే’ని ‘హాలిడే’గా కార్పొరెట్ ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో వారిపై నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి లేచిన గొంతు , ఓటు వేయడానికి , ఓటు వేయండి అని చెప్పడానికి లేవలేదే అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకూ ఓటర్లే రాలేదు. దీంతో చేసేదేమీ లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. పోలింగ్ సమయం మరికొద్ది సమయంలో ముగుస్తున్నా కూడా ఓటేయడానికి జనాలు ఇళ్ల నుంచి బయటి రావట్లేదు కానీ.. నగరు శివారులో మాత్రం ఓటేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

దీనితో కొంతమంది సామాన్యులు... పోలింగ్‌ కేంద్రం వైపు కన్నెత్తి చూడని వారికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఓటు వినియోగించుకోని వారికి ఓటు హక్కు అవసరమా, వెంటనే వారికున్న ఆ హక్కును తీసేయండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఎవరు తీశారో కానీ ఓ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. జీహెచ్ ఎంసీ లో ప్రతిసారి తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఈసారి కూడా పోలింగ్ శాతం పెంచాలని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు, కాని ఈసారి కూడా పోలింగ్ మందకొడిగా జరగడంతో అధికారులు పెదవి విరుస్తున్నారు. యువత, చదువుకున్న వారు ఇళ్లకే పరిమితమయితే, వృద్ధులు, దివ్యాంగులు మాత్రం ఓటువేసి ఆదర్శంగా నిలిచారు.

ఈ సమయంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలని బీజేపీ అగ్రనేత అద్వానీ గతంలో చేసిన వ్యాఖ్యల పై మళ్లీ చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న అద్వానీ ఓటు వేయడం తప్పనిసరి చేయాలని గతంలో అనేకసార్లు తెలిపారు. అలాగే ఓటు హక్కు ఉండి కూడా వినియోగించుకొని వారికి ఓటు వేయనివారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయాలని సూచించారు. ప్రజా స్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును ఓటర్లు ఉపయోగించుకోకపోవడంపై మేధావులు తప్పుబడుతున్నారు.

మధ్యాహ్నం మూడు గంటల వరకు బోరబండ 35.69, అల్లాపూర్‌ 33.43, వెంగల్ ‌రావ్ ‌నగర్‌ 28.32, రెహమత్ ‌నగర్‌ 31.11 , ఎర్రగడ్డ 30.55, ఫతేనగర్‌ 34.77 శాతం, సనత్ ‌నగర్ 26.19, అమీర్ ‌పేట్‌ 26.21, ఫలక్‌ నుమా 17, నవాబ్ ‌సాబ్‌ కుంట 18.2, దూద్‌ బౌలి 17.98, జహాన్‌ నుమా 11.95, కిషన్‌బాగ్‌ 14.23, లలితాబాగ్‌ 26.26, రియాసత్‌నగర్ 23.32, కంచన్‌బాగ్‌ 32.32, చాంద్రయాణగుట్ట 18.98, ఉప్పుగూడ 29.37, గోషామహల్‌ 16.03, మంగళ్ ‌హట్‌ 19.69, భారతినగర్‌ లో 49.54, పటాన్‌ చెరు 51.52 పోలింగ్ నమోదయ్యింది. లంగర్‌ హౌస్ ‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్‌ నమోదవ్వగా, అత్యధికంగా బాగ్ ‌అంబర్ ‌పేట్‌ 64.82 శాతం పోలింగ్ నమోదయ్యింది.