Begin typing your search above and press return to search.

క‌రోనా నేర్పిన ఆర్థిక పాఠాలు: ఇవి పాటిస్తే భ‌విష్య‌త్ బంగారు

By:  Tupaki Desk   |   6 May 2020 3:30 PM GMT
క‌రోనా నేర్పిన ఆర్థిక పాఠాలు: ఇవి పాటిస్తే భ‌విష్య‌త్ బంగారు
X
క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌‌తో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఉపాధి.. ఆదాయం కోల్పోవ‌డంతో ఉన్నంత‌లో ఖ‌ర్చు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లంతా పొదుపు బాట ప‌ట్టారు. ఆదాయం వ‌చ్చే మార్గాలు మూసుకుపోవ‌డం.. ఉపాధి కోల్పోవ‌డంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఎన్నో పాఠాలు, గుణ‌పాఠాలు నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక విష‌యాల్లో ప్ర‌జ‌లు మెరుగ‌వుతున్నారు. ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన క‌ష్టాల‌న్ని త‌ట్టుకో లేక‌పోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రు కీల‌క స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నారు. వారు ఇచ్చే స‌ల‌హా మనీ మేనేజ్‌మెంట్. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అనేది త‌ప్ప‌ని స‌రిగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

ఇక నుంచి డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు పెట్ట‌డం ఆపేయాలే నిర్ణ‌యానికి ప్ర‌జ‌లు వ‌చ్చారు. ఆర్థిక‌వేత్త‌లు, సీఏలు ఇవే చెబుతున్నారు. చేతిలో డబ్బులుంటే ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం, క్రెడిట్ కార్డు ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేకపోయినా షాపింగ్ చేయ‌డం త‌గ్గించాలి. అనవసర ఖర్చుల జోలికి వెళ్లొద్దు.

వాస్త‌వంగా ప్ర‌జ‌ల‌కు ప్రతినెల వ‌చ్చే ఆదాయ మార్గాలు మాసుకుపోయాయి. వ్యాపారాలు న‌డ‌వ‌డం లేదు. ఉద్యోగాలు లేవు.. కూలీలు, ప‌నులు లేవు. ఈ నేప‌థ్యంలో ఆదాయం రావ‌డం లేదు. దీంతో ఇన్నాళ్లు చేసిన పొదుపును తీసేసి ఇప్పుడు ఖ‌ర్చు చేస్తున్నారు. సాధారణంగా అంద‌రూ వ‌చ్చే ఆదాయం క‌న్నా అధికంగా ఖ‌ర్చులు చేస్తుంటారు. అది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని ఆర్థిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. పొదుపు ఎక్కువ‌.. ఖ‌ర్చు త‌క్కువ ఉండేలా చూసుకోవాల‌ని చెబుతున్నారు.

ఆర్భాటాలకు పోయి.. అవసరమున్నా లేకపోయినా అప్పులు చేసి ఖర్చు చేయ‌డం త‌గ్గించేయాలి. అత్యావసరమైతే తప్ప అప్పు చేయాల‌ని సూచిస్తున్నారు. మనకు వచ్చే వేతనంలో కొంత మొత్తాన్ని ఖర్చుల కోసం, మరి కొంత మొత్తం భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు పొదుపు విలువ చెబుతోంది. పొదుపు ఎంత ఇప్పుడు ఉప‌యోగ‌ప‌డుతుందో గుర్తుచేసుకుంటున్నారు.

ఉద్యోగ భ‌ద్ర‌త‌, ఆదాయం ఎంత‌ వస్తోంది అని ప‌రిశీలించి రుణాలు తీసుకోవాలి. ఇల్లు, కారు వంటి వాటికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం. వీటి కొనుగోలుకు బాగా ఆలోచించి మ‌న ఆర్థిక ప‌రిస్థితి అంచ‌నా వేసుకుని ముంద‌డుగు వేయాలి. అప్పు చేసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది.

- ప్రతి వ్యక్తికి బడ్జెట్ ప్లాన్ అవసరం. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ తో బడ్జెట్ ప్లాన్ ఎంత అవసరమో చాలా మందికి తెలిసింది. ఆదాయం, ఖర్చులు ఆధారంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.

- వ‌చ్చే జీతంలో ఇంటి కిరాయి, వాహనం పెట్రోల్ ఖర్చు, ఈఎంఐలు, నెలసరి వస్తువుల వ్య‌యం.. ఇలా ఖర్చులు ఉంటాయి. అయితే వ‌చ్చే ఆదాయంలో ఖ‌ర్చులకు 50 శాతం వెచ్చించాలి. మిగతా దానిలో 30 శాతం పొదుపు, మరో 20 శాతం అత్యావ‌స‌ర నిధిగా డ‌బ్బు ఉంచాలి. ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

- ఓ కంపెనీలో ఎక్కువ కాలం పని చేశాక ప‌దోన్న‌తులు, వేత‌నాల పెంపు వంటివి త‌గ్గిపోతాయి. కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్న క్ర‌మంలో మ‌నం కూడా మంచి ప్యాకేజీ చూసి ఉద్యోగం మారేందుకు ప్ర‌య‌త్నించాలి.

- కేవ‌లం జీతం.. లేదా ఒకే వ్యాపారంతో వ‌చ్చే ఆదాయంపైనే ఆధార‌ప‌డితే క‌ష్టం. రెండో ఆదాయం వ‌చ్చే మార్గం చూసుకోవాలి. లేకుంటే క‌ష్టాలు ఎదుర‌వుతాయి. ప్రతి వ్యక్తి తనకు ఉన్న వ్యాపారం, ఉద్యోగంతో పాటు రెండో వేతనం వచ్చేలా చూసుకోవాలి.

- మ్యూచువల్ ఫండ్స్, ప్లాట్స్, ఈక్విటీ, బంగారం వంటి వాటిల్లో పెట్టుబ‌డులు పెట్టాలి. అయితే ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి.