Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మ్యాచులని అడ్డుకుంటాం : ఎమ్మెల్యే దానం నాగేందర్

By:  Tupaki Desk   |   20 Feb 2021 11:10 AM GMT
ఐపీఎల్ మ్యాచులని అడ్డుకుంటాం : ఎమ్మెల్యే దానం నాగేందర్
X
ఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ . ఇటీవలే ఐపీఎల్ 2021 ఆక్షన్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ మినీ వేలంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్‌ రైజర్స్ హైద‌రాబాద్ టీమ్‌లో స్థానిక ఆటగాళ్లకు చోటు కల్పించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ ఆర్ హెచ్ టీమ్‌లో స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్‌ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ లను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీచేశారు.

హైదరాబాదులో సత్తా కలిగిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు.వారిని జట్టులోకి తీసుకోకపోవడం దారుణమని దానం చెప్పారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాద్‌ టీమ్‌ కు కెప్టెన్ ‌గా ఉండడం కరెక్ట్‌ కాదని ఆయన అభిప్రయాపడ్డారు. ఎస్‌ ఆర్‌ హెచ్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు స్థానం లేనప్పుడు.. జట్టు పేరును వెంటనే మార్చాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

స‌న్రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైసీ కేవలం ముగ్గురు క్రికెటర్ల‌ను మాత్ర‌మే త‌న జ‌ట్టులో చేర్చుకోగ‌లిగింది. అయితే, వేలంలో హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లను ఒక్కరిని కూడా తీసుకోలేదు. గతేడాది భావనక సందీప్ ‌ను తీసుకున్న హైదరాబాద్, ఈ సారి అతన్ని వదిలేసింది. అతని స్థానంలో మరో ఆటగాడిని కనీస ధరకు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. దీనిపై అటు అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ సైతం దీనిపై అసహనం వ్యక్తం చేశారు.సన్‌ రైజర్స్‌ జట్టులో, హైదరాబాద్‌ కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది అని అజార్ ట్వీట్‌ చేశాడు.

ఇక, ఐపీఎల్ వేలంలో హైదరాబాద్‌ కి చెందిన స్పిన్నర్ భగత్ వర్మ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా అతడిని సన్ ‌రైజర్స్ హైదరాబాద్ పట్టించుకోలేదు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధరకే అతడ్ని ఎగరేసుకుపోయింది. ఇక, ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్‌ భరత్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, హరిశంకర్‌ రెడ్డిని కనీసం ధర రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేశాయి.