Begin typing your search above and press return to search.

కర్ణాటకలో మాజీ సీఎంలకు లేఖలు: చంపేస్తామంటూ..

By:  Tupaki Desk   |   9 April 2022 7:32 AM GMT
కర్ణాటకలో మాజీ సీఎంలకు లేఖలు: చంపేస్తామంటూ..
X
కర్ణాటక రాష్ట్రంలో మొన్నటి వరకు హిజాబ్ వ్యవహరం అట్టుడికింది. రాష్ట్రంలో అలజడి సృష్టించిన ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం లేపింది. అయితే హైకోర్టు తీర్పుతో ఈ వివాదం సమసిపోగా రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రులు, రచయితలను చంపేస్తామంటూ ఓ వ్యక్తి సదరు వ్యక్తులకు లేఖలు పంపించారట. ఈ లేఖలు అందుకున్న వారు మీడియాకు సమాచారం అందించారు. తమను చంపేస్తామంటూ కొందరు లేఖలు రాశారని, అయితే ఇలాంటి బెదిరింపులు మమ్మేల్ని ఏం చేయలేవని వారు అంటున్నారు. కొన్ని నెలలుగా మత కల్లోలు జరుగుతున్న రాష్ట్రంలో.. తాజాగా రిలీజైన ఈ లేఖలో 'ఓ కరుడుగట్టిన హిందువు' అని పేర్కొనడం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్రంలో మరో ఆందోళనకు భీజం పడనుందా..? అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు హిజాబ్ ధరించొద్దని, స్కూల్ యూనిఫాం వేసుకొని వెళ్లాలని కొన్ని రోజుల కిందట హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అప్పటి వరకు జరగుతున్న మతకల్లోలాలకు తెరపడిందని కొందరు భావించారు. అయితే ఇటీవల బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే హలాల్ వివాదాన్ని సృష్టించారు. హిందువులు హలాల్ మటన్ తినొద్దని, వాటి వల్ల అనారోగ్యంగా తయారవుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కానీ ప్రభుత్వం చర్యలతో ఆందోళనను కట్టడి చేసింది.

తాజాగా కొందరు మాజీ ముఖ్యంత్రులు, రచయితలకు ఓ లేఖ రావడం కలకం రేపింది. మొత్తం 60 మందికి ఈ లేఖలు అందాయి. ఇందులో ' మీరు ముస్లింల పక్షాన ఉంటూ హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారు. అంతా హిందుమత ద్రోహులు.. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి..' అంటూ లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ లేఖలు అందుకున్న వారిలో మాజీ ముఖ్యమంత్రులు సిద్ధ రామయ్య, కుమారస్వామిలు ఉన్నారు. అలాగే ప్రముఖ రచయిత కుమ్ వీరభద్రప్ప (కుంవీ)కి కూడా ఈ లేఖ అందింది.

కుమ్ వీరభద్రప్ప బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మత విభజన, విద్వేశానికి వ్యతిరేకంగా మాట్లాడారిన లేఖలు రాసిన వ్యక్తులు ఆరోపించారు. అంతేకాకుండా మాజీ సీఎంలు సైతం మత విద్వేశాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని అంటున్నారు. హిందుత్వ సంస్థలను విమర్శలు చేస్తున్న వారికి ఎప్పటికైనా చావు తప్పదంటూ ఈ లేఖలో హెచ్చరించారు. కాగా ఈ లేఖలు ఎవరు పంపించారనే విషయం తెలియకపోయినా.. వీటి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. ఇక ఈ లేఖలో చివరగా 'ఓ సహనం కలిగిన హిందువు' అని పేర్కొనడం కలకలం రేపుతోంది.

అయితే దీనిపై కుంవీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు వాదనలు చేస్తూ కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలను స్వయంగా హోంమంత్రే సృష్టిస్తున్నప్పుడు ఇక ఫిర్యాదు చేయడం దేనికి..? అని ప్రశ్నించారు.

రాష్ట్ర పోలీసులపై తనకు ఎలాంటి విశ్వాసం లేదని, అందువల్ల పోలీసులకు ఫిర్యాదు చేయనని కుంవీ పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ లేఖ ఎవరు రాశారన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మత కల్లోలాలతో రాష్ట్రంలో అలజడి మొదలైంది. ఇప్పుడు ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు.