Begin typing your search above and press return to search.

నీతిఅయోగ్ దర్శకత్వంలో ‘‘భూమి బ్యాంక్’’

By:  Tupaki Desk   |   24 Dec 2015 4:58 AM GMT
నీతిఅయోగ్ దర్శకత్వంలో ‘‘భూమి బ్యాంక్’’
X
వ్యవసాయంలో అనూహ్య మార్పులు వచ్చేలా నీతి అయోగ్ ఓ అద్భుతమైన ఐడియా తయారు చేసింది. దీనికి రాజకీయ పార్టీల చేయూత లభించింది. కేంద్రసర్కారు సీరియస్ గా తీసుకుంటే.. వ్యవసాయంలో సరికొత్త విప్లవం చోటు చేసుకోవటం పక్కా. నీతిఅయోగ్ రచించిన ఈ వ్యూహం మొత్తం వివరాల్లోకి వెళితే..

చేతిలో డబ్బు లేని చాలామంది వ్యాపారం చేయాలంటే బ్యాంకుల్ని సంప్రదిస్తారు. బ్యాంకుల వద్ద అప్పు తీసుకొని.. వ్యాపారం చేసి అప్పుని.. వడ్డీని చెల్లిస్తారు. దాన్నే కాస్తంత మార్చి కౌలు రైతులకు అప్లై చేస్తే..? ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. మీకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి లేదు. అదే సమయంలో కౌలుకు ఇచ్చే విషయంలో సందేహాలు ఉన్నాయి. మరి.. ఆ భూమిని ఏం చేస్తారు? నిరుపయోగంగా వదిలేస్తారు. ఇలాంటి తరహా భూములు దేశంలో పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో.. వినియోగంలోకి రాని వ్యవసాయ భూముల్ని అందరూ వినియోగించుకునేలా ఏదైనా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే తాజా.. ‘‘భూ బ్యాంక్’’.

ఈ భూబ్యాంక్ లో భూమి ఉన్న వారంతా తమ వివరాల్ని నమోదు చేసుకొని.. ప్రభుత్వ సంస్థకు తమ భూమిని డిపాజిట్ చేస్తారు. ఈ భూమిని సేకరించిన సంస్థ.. కౌలుకు తీసుకునే వారికి అప్పగిస్తారు. ఏడాదికి ఎంత కౌలుఅన్నది నిర్ణయించి.. ఆ ప్రకారం కౌలుదారు ఆ మొత్తాన్ని సదరు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. మరి.. ఇంత పని చేస్తున్న సదరు సంస్థకు నామమాత్రంగా సేవ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. పలు సమస్యల్ని మనసులో ఉంచుకొని కౌలుకు భూమి ఇచ్చేందుకు వెనుకాడే ఎంతోమంది ఎలాంటి సందేహాలు లేకుండా భూమిని ఇచ్చేస్తుంటారు. అదే సమయంలో కౌలుకు భూమిని తీసుకొని వ్యవసాయం చేయాలనుకునే వారు వ్యవసాయం చేస్తారు. దీంతో.. పంటలు పెరిగే అవకాశం ఉంది.

ఈ ఆలోచన చేసిన నీతిఅయోగ్.. తాజాగా ఒక పత్రాన్ని రూపొందించింది. ప్రాధమికంగా ఐడియా బాగున్నా.. అమలులో చాలానే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. భూమిని అమ్మాలనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి? విపత్తుల్లో పంట నష్టం జరిగితే పరిస్థితి ఏంటి? పండించిన పంటకు సంబంధించి మద్దతు ధర లభించకపోతే ఏం చేయాలి? దిగుబడి ఆశించినంతగా రాకుంటే ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కార్యాచరణను రూపొందిస్తోంది నీతి అయోగ్. తాజాగా రూపొందించిన భూబ్యాంక్ ఐడియా పలువురిని ఆకర్షిస్తోంది.