Begin typing your search above and press return to search.

108 మాదిరిగా ఈ స్కీమ్‌పైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకుందా?

By:  Tupaki Desk   |   31 Aug 2022 5:11 AM GMT
108 మాదిరిగా ఈ స్కీమ్‌పైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకుందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఫ్యామిలీ ఫిజీషియ‌న్ విధానాన్ని అమల్లోకి తెస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ప్రతి ఐదు లేదా ఏడు గ్రామాలకు ఒక వైద్యుడిని కేటాయిస్తారు. ఆయా వైద్యులు తమకు కేటాయించిన గ్రామాల ప్రజల వ‌ద్ద‌కు వెళ్లి వైద్య సేవలు అందించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యాన్ని దగ్గర చేయడమే ఫ్యామిలీ ఫిజీషియ‌న్ లక్ష్యం. అలాగే ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు 104 అంబులెన్సుల‌ను పంపిస్తారు. కేటాయించిన గ్రామాల్లో ఒక ప్రత్యేక వైద్యుడు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ఉంటారు. మరో వైద్యుడు గ్రామంలోకి వెళ్లి నేరుగా ప్రజలను పరీక్షిస్తారు. కావాల్సిన ప‌రీక్ష‌ల‌ను, మందుల‌ను సూచిస్తారు.

ఈ వాస్త‌వానికి ఈ ఫ్యామిలీ ఫిజీషియ‌న్ విధాన ఆగ‌స్టు 15నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌లో ఫ్యామిలీ ఫిజీషియ‌న్ విధానాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు.

ఫ్యామిలీ ఫిజీషియ‌న్ విధానంతో చాలా జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలుంటుంద‌ని చెబుతున్నారు. ఇందుకు అదనంగా అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నామని ర‌జ‌ని తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధుల్లో ఉండే ఉద్యోగులకు టీఏ, డీఏ కింద ఏడాదికి రూ.5.61 కోట్లు చెల్లిస్తామ‌న్నారు. అలాగే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లకు అవసరమైన ఔషధాలు, రసాయనాలను సరఫరా చేశామ‌ని చెప్పారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేయబోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఆసుపత్రుల భవనాల నిర్మాణాలను డిసెంబరులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేప‌ట్టామ‌ని మంత్రి ర‌జిని తెలిపారు.

తల్లీబిడ్డల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌న్నారు. ప్రతి పీహెచ్‌సీలో ప్రసవాలు జరిగేవిధంగా చూడాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామ‌ని గుర్తు చేశారు. అన్ని గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభిస్తామని వెల్ల‌డించారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందేవిధంగా వైద్యులు ప‌ర్య‌వేక్షించాల‌ని కోరారు.

ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వమే ఇంటింటికి వైద్యసేవలు అందిస్తుందని తెలిపారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్తగా 176 మంది మెడికల్‌ ఆఫీసర్లను, 1,681 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమిస్తామని చెప్పారు.

అదేవిధంగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 65 రకాల మందులు అందుబాటులో ఉంచామ‌ని చెప్పారు. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ప్రత్యేక యాప్‌లు కూడా అన్ని స్థాయిల సిబ్బందికి అందుబాటులోకి తెచ్చామని వివ‌రించారు. అదేవిధంగా మొబైల్ మెడిక‌ల్ యూనిట్లు (ఎంఎంయూ) వాహనాలను 45 రోజుల్లో సిద్ధం చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్యవిధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయ‌ని ర‌జ‌ని చెప్పారు. ఈ విధానంలో వైద్యులు, ఏఎన్‌ఎంలు వారి ఇళ్లకు సేవలందిస్తారని తెలిపారు.

కాగా 108 అంబులెన్సులు, ఆరోగ్య‌శ్రీ మాదిరిగానే ఫ్యామిలీ ఫిజీషియ‌న్ విధానం కూడా త‌మ‌కు మంచి పేరు తెస్తోంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆశిస్తోంది. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రావ‌డానికి 108 అంబులెన్సులు, ఆరోగ్య‌శ్రీ కార‌ణ‌మైన‌ట్టే ఫ్యామిలీ ఫిజీషియ‌న్ విధానం కూడా స‌క్సెస్ అయితే ఇది త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు కురిపిస్తుంద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.