Begin typing your search above and press return to search.

లింబయ్య కొడుక్కి ‘లెక్క’ చెబుతారా?

By:  Tupaki Desk   |   13 Sep 2015 3:53 AM GMT
లింబయ్య కొడుక్కి ‘లెక్క’ చెబుతారా?
X
హైదరాబాద్ నడిబొడ్డున ఉరి వేసుకొని తనువు చాలించిన రైతు లింబయ్య వ్యవహారం తెలంగాణ రాష్ట్ర సర్కారుకు తలకు చుట్టుకుంటోంది. లింబయ్య ఆత్మహత్య పై తెలంగాణ రాష్ట్ర సర్కారు చేస్తున్న వరుస ప్రకటనలు.. అందుకు ప్రతిగా తెరపైకి వస్తున్న వాదనలతో తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి.

లింబయ్య ఆత్మహత్య చేసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. లింబయ్య పొలంలో పంట బ్రహ్మాండంగా ఉందని.. ఆయన ఆర్థికంగా శ్రీమంతుడని.. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడే తప్పించి.. పంట నష్టం గురించి కాదంటూ నివేదిక ఇవ్వటం తెలిసిందే.

ఈ మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ.. లింబయ్య వడ్డీ వ్యాపారి అని.. అతని దగ్గర డబ్బులు చాలానే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. తన మీద వెల్లువెత్తుతున్న విమర్శలకు ఎదురుదాడితో నోరు మూయించాలని తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించటం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తమ కుటుంబంపై తెలంగాణ సర్కారు చేస్తున్న వ్యాఖ్యలపై లింబయ్య కుమారుడు తీవ్రంగా మండిపడుతున్నారు. తన తండ్రి డబ్బుల్ని వడ్డీకి ఇచ్చేవాడంటూ చేస్తున్న తెలంగాణ సర్కారుకు అతగాడు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాడు. మా నాన్న డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడైతే.. వడ్డీ లేకున్నా ఫర్లేదు.. ఆ డబ్బులేదో ఇప్పించాలని కోరుతున్నాడు. ‘‘వడ్డీ అక్కర్లేదు. అసలు ఇప్పించండి’’ అంటూ వ్యాఖ్యానించాడు.

నివేదికలో పేర్కొన్న ప్రకారం తన తండ్రి వడ్డీకి ఇచ్చిన మొత్తంలో అసలు ప్రభుత్వం వసూలు చేసి ఇప్పించాలని.. తమకు వేర్వేరు ఆదాయాలు ఉన్నట్లు మీడియాలో రావటం పట్ల స్పందిస్తూ.. ‘‘మా చిన్నాన్న నేర్రళ్ల చిన్న లింబాద్రి గ్రామంలో కాందారు పని చేస్తుంటాడు. ఆయనతో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయనకు ఉద్యోగం ఉంటే.. అతను మాకు ఎందుకు డబ్బులిస్తాడు? అప్పుల బాధతో మా నాన్న చనిపోతే.. ఇష్టుసారం మాట్లాడటం తగదు’’ అని లింబయ్య కుమారుడు నవీన్ పేర్కొన్నాడు.

పంట మీద చేసిన అప్పులకు తట్టుకోలేక.. తమకున్న పొలంలో కొంతభాగాన్ని కౌలుకు ఇచ్చామని.. మిగిలిన దాంట్లో సోయా.. చెరుకు తోటను సాగు చేస్తున్నామని.. ఈ పంట కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పిన లింబయ్య కుమారుడు.. ప్రభుత్వం చేతనైతే సాయం చేయాలే తప్పించి.. అబద్దాలు చెప్పి అవమానించకూడదంటున్నాడు. ఇంటి పెద్ద పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టేవే. లింబయ్య వడ్డీవ్యాపారి అని తేల్చేసిన తెలంగాణ సర్కారు.. అతని కుమారుడు అడిగినట్లుగా వడ్డీ వదిలేసి.. అసలును వసూలు చేసి ఇచ్చే బాధ్యతను తీసుకుంటుందా? ఈ సూటి ప్రశ్నకు టీ సర్కారులో సమాధానం చెప్పేవారెవరు..?