Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఇంటి ఓనర్ ఇంత కబ్జా చేశాడా?

By:  Tupaki Desk   |   6 March 2021 4:30 PM GMT
చంద్రబాబు ఇంటి ఓనర్ ఇంత కబ్జా చేశాడా?
X
అమరావతి పరిధిలో చంద్రబాబు ఉంటున్న ఇల్లు ప్రముఖ వ్యాపారవేత్త ‘లింగమనేని రమేశ్ ’దన్న సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణా నది కరకట్టపై ఎంతో సుందరగా రమేశ్ కట్టుకున్న ఇంటిలోనే ఉండి గత ఐదేళ్లు చంద్రబాబు ఏపీని పాలించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ‘ఐజేఎం’ పేరుతో లింగమనేని రమేశ్ ఎన్నో ఇళ్లు, వెంచర్లు, భూక్రయవిక్రయాలు చేస్తుంటారు.

అయితే తాజాగా రియల్ ఎస్టేట్ పేరుతో లింగమనేని రమేశ్ ‘మైనార్టీల భూములను వదల్లేదని.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని , నిడమర్రు గ్రామాల్లో అపార్ట్ మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1200 ఎకరాలకు పైగా భూములను లింగమనేని సంస్థ ‘ఐజేఎం’ కబ్జా చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో ప్రైవేటు భూములతోపాటు వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. పీర్ల మన్యం భూములను లింగమనేని సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం (మైనార్టీల భూములు) పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయని అధికారులు తేల్చారు. పూర్వం మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని.. కౌలుకు ఇచ్చిన భూములను కొందరు పట్టాలు చేసుకొని పాసుపుస్తకాలు పుట్టించి విక్రయించారని అధికారుల విచారణలో తేలింది.

ఈ ఖరీదైన భూములు ఎకరాకు రూ.3 కోట్లకు పలుకుతాయని అధికారులు తేల్చారు. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం పట్టాలు,పాసు పుస్తకాలు ఉన్నా ఈ మైనార్టీ భూములు చెల్లవని.. తిరిగి వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

వక్ఫ్ భూములు 11 ఎకరాలను గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చామని తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. కోర్టుకెళ్లినా చట్ట ప్రకారం ఈ భూములను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవచ్చన్నారు. విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

లింగమనేని వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేశాడన్న ప్రచారం అధికారుల విచారణలో తేలడంతో ‘చంద్రబాబు ఇంటి ఓనర్’ ఇలా కబ్జా చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. పలువురు నేతలు దీన్ని ఎలుగెత్తి చాటుతున్నారు.