Begin typing your search above and press return to search.

59 లక్షల ఓట్లు గల్లంతైపోనున్నాయా?

By:  Tupaki Desk   |   10 Aug 2015 7:22 AM GMT
59 లక్షల ఓట్లు గల్లంతైపోనున్నాయా?
X
ఎన్నికలు వచ్చినపుడల్లా అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ వైరి పార్టీలకు అనుకూలంగా ఉండేవాళ్ల ఓట్లకు తెలివిగా కోత పెట్టేస్తూ ఉంటుంది. ఐతే అలాంటి ఓట్లు మరీ భారీ సంఖ్యలో ఏమీ ఉండవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపితే ఆ నంబర్ కొన్ని లక్షల్లో మాత్రమే ఉంటుంది. మొత్తం ఉన్న ఓట్లతో పోలిస్తే అది చాలా చిన్న నంబర్. ఐతే ఒకేసారి ఏకంగా 59 లక్షలు ఓట్లు తీసేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడదే జరగబోతోంది. ఈసారి పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికల సంఘమే ఆ పని చేయబోతోంది. బోగస్ ఓట్లు ఏరేయడం కోసం ఆధార్ కార్డుకు, ఓటరు కార్డుకు ముడిపెట్టిన ఎన్నికల సంఘం లక్ష్యం దిశగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 లక్షల ఓట్లకు కోత పడబోతోంది.

ఓటు వస్తోంది కదా అని హైదరాబాద్ లో ఒకటి స్వస్థలంలో ఒకటి ఓట్లు తీసేసుకున్న ప్రబుద్ధులకు లెక్కేలేదు. అలాంటి వాళ్లంతా ఆధార్, ఓటర్ కార్డు లంకె తో దొరికిపోయారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 59 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపినట్లు ఎన్నికల సంఘం ముఖ్య అధికారి బన్వర్ లాల్ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడమో, లేక ,ఇళ్లు మారడమో జరిగినట్లు భావించి వారికి నోటీసులు ఇచ్చినట్లు బన్వర్ లాల్ చెప్పారు. ఎపిలో 30,50,000 మందికి, తెలంగాణలో 28,40,000 మందికి నోటీసులిచ్చిన్టలు ఆయన తెలిపారు. రెండువారాల్లో నోటీసులకు స్పందించకపోతే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఒక వేళ ఇళ్లు మారినట్లయితే కొత్త చిరునామాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఓటు వేయడానికి ముందు రోజు వరకు కూడా ఓటర్లుగా చేరే అవకాశముందని ఆయన తెలిపారు.