Begin typing your search above and press return to search.

ఈటెల భ‌య్‌.. కేంద్రాన్ని అడుక్కోవ‌టం ఏంది?

By:  Tupaki Desk   |   13 Jun 2018 4:43 AM GMT
ఈటెల భ‌య్‌.. కేంద్రాన్ని అడుక్కోవ‌టం ఏంది?
X
రైతుల‌కు పంట సాయం అందించేందుకు దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా ఏడాదికి రూ.12వేల కోట్ల‌ను వినియోగిస్తున్న వైనాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం మా గొప్ప‌గా చెప్పుకోవ‌టం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూస‌ర్వే మొద‌లు.. ల‌క్ష‌లాది చెక్ ల్ని రూపొందించ‌టం లాంటి భారీ ప్రోగ్రామ్‌ ను అల‌వోక‌గా చేయ‌టం తెలిసిందే. ప్ర‌జాసంక్షేమం కోసం ఎంత‌టి భారీ ప‌థ‌కాల్ని అయినా వెన‌కాడ‌కుండా చేస్తామ‌ని చెప్పుకునే తెలంగాణ ముఖ్య‌మంత్రి తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మాట‌లు ఉన్నాయి.

ర‌క‌ర‌కాల పేర్ల‌తో సంక్షేమ ప‌థ‌కాల్ని తీసుకొచ్చే సంప‌న్న రాష్ట్రం.. ప్ర‌జ‌లంద‌రికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా నిర్ణ‌యం ఎందుకు తీసుకోద‌న్న సందేహం ఈటెల మాట‌లతో క‌ల‌గ‌టం ఖాయం. పెట్రో ఉత్ప‌త్తుల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకెళ‌తామంటే.. తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తామ‌ని ఈటెల వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికే 52 శాతం వ్యాట్ జీఎస్టీ ప‌రిధిలోకి వెళ్లింద‌ని.. 48 శాతం వ్యాట్ మాత్ర‌మే పెట్రోల్‌.. డీజిల్.. మ‌ద్యం లాంటి కొన్నింటి ద్వారా రాష్ట్రాల‌కు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు.

ఈటెల వారి మాట‌ల్ని మ‌రింత వివ‌రంగా చెప్పుకోవాలంటే.. మొత్తం ప‌న్నుల ద్వారా ఒక రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం రూపాయి అనుకుంటే.. అందులో 52 పైస‌ల ఆదాయాన్ని జీఎస్టీ పేరుతో కేంద్రం తీసుకెళ్లిపోయింద‌ని.. మిగిలిన 48 పైస‌ల ప‌న్నుఆదాయం పెట్రోల్‌.. డీజిల్‌.. మ‌ద్యం అమ్మకాల ద్వారా వ‌స్తుంద‌ని చెప్పారు. రైతుల పంట సాయానికి రూ.12వేల కోట్లు.. రైతుల బీమా కోసం వంద‌లాది కోట్ల‌తో పాటు.. వేలాది కోట్ల‌తో నిర్మించాల‌నుకుంటున్న డ‌బుల్ బెడ్రూం ఇళ్లు లాంటివి మ‌రెన్నో సంక్షేమ ప‌థ‌కాల‌కు అవ‌స‌ర‌మైన నిధులు కేంద్రంతో పాటు రాష్ట్రానికి నేరుగా రావటానికి పెట్రోల్..డీజిల్‌.. మ‌ద్యం అమ్మ‌కాల‌తోనే అన్న‌ది ఈటెల వారి మాట‌.

కొత్త కొత్త ప‌థ‌కాల్ని తీసుకురావొద్ద‌ని చెప్పం కానీ.. ప్ర‌జ‌ల వీపు మోత మోగుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గించేందుకు వీలుగా.. వాటిపై విధించే ప‌న్నుల్ని త‌గ్గించే విష‌యంలో మాత్రం ఈటెల ఆలోచ‌న‌లు ముందుకు సాగ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాము చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దేశం తెలంగాణ వైపు చూస్తుందంటూ గొప్ప‌లు చెప్పుకునే పెద్ద‌మ‌నిషి.. మిగిలిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచేలా.. పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల్ని కేంద్రంతో సంబంధం లేకుండా భారీగా త‌గ్గిస్తే ఎంత బాగుంటుంది.

అయితే.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే అలాంటి ప‌ని చేసేందుకు ఈటెల స‌ముఖంగా లేర‌న్న వైనం తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌తోనే స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని చెప్పాలి. జీఎస్టీ కార‌ణంగా రాష్ట్రాల‌కు వ‌చ్చే ఆదాయాల్ని కేంద్రం త‌గ్గించింద‌ని.. తాజాగా పెట్రో ఉత్ప‌త్తుల్ని జీఎస్టీలోకి తీసుకెళ్లి రాష్ట్రాల ఆర్థికప‌రిస్థితిని దెబ్బ తీసేలా కేంద్రం ప్లాన్ చేస్తుందంటూ ఆరోపించారు. పెట్రో ఉత్ప‌త్తుల్ని జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకెళితే తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తామ‌న్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాలు అసూయ ప‌డేలా సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేసే తెలంగాణ స‌ర్కారు సైతం.. పెట్రో ఉత్ప‌త్తుల‌పై ప‌న్నుపోటు త‌గ్గించేందుకు వెన‌క‌డుగు వేయ‌ట‌మా? పోతే పోయింది.. కేంద్రానికి క‌ళ్లు తెరిపించేలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌చ్చుగా ఈటెల‌? అడ‌గ‌కున్నా వ‌రాలు ఇచ్చే ముఖ్య‌మంత్రి ఉన్న రాష్ట్రం.. సాదాసీదా ప్ర‌జానీకానికి సాంత్వ‌న క‌లిగించేలా పెట్రో ఉత్ప‌త్తుల‌పై ప‌న్ను పోటు త‌గ్గించ‌రెందుకంటారు?