Begin typing your search above and press return to search.

రేపు డ్రై డే.. దేశమంతా మద్యం బంద్!

By:  Tupaki Desk   |   22 May 2019 11:49 AM GMT
రేపు డ్రై డే.. దేశమంతా మద్యం బంద్!
X
ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్న నేపథ్యంలో రేపు దేశ వ్యాప్తంగా డ్రై డే అని ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఎక్కడా మద్యం దుకాణాలను ఓపెన్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేయగా.. ఎక్సైజ్ శాఖ వారు మద్యం దుకాణాల నిర్వాహకులకు ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

దేశమంతా జరిగిన ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగనుంది. కేంద్రంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయనున్నారనే అంశం గురించి రేపు తేలిపోనుంది. దేశ జనాభాలోని అరవై ఏడు శాతం ఓటు హక్కును వినియోగించుకుని రాబోయే ఐదేళ్లకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వారి తీర్పు ఏమిటో రేపు ఈ పాటికి తేలిపోనుంది.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే గాక.. ఏపీ , ఒడిశా వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫలితాలూ రేపు వెల్లడి కానున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఫలితాల వెల్లడి తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉండనే ఉంటాయి. గతంలో ఎప్పుడు ఫలితాలు వచ్చినా అలాంటి గొడవలు తప్పలేదు. ఇలాంటి నేపథ్యంలో రేపు కూడా అలాంటి పరిస్థితి ఉండవచ్చు. అలాంటి గొడవలను మద్యం మరింతగా ప్రోత్సహిస్తుంది. అందుకే ఎన్నికల కమిషన్ రేపు ఎక్కడా మద్యం అందుబాటులో లేకుండా చూస్తోంది. మంచి పనే.