Begin typing your search above and press return to search.

లిక్క‌ర్ హీట్.. బండి సంజ‌య్, ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు!

By:  Tupaki Desk   |   23 Aug 2022 6:23 AM GMT
లిక్క‌ర్ హీట్.. బండి సంజ‌య్, ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు!
X
తెలంగాణ‌లో ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ సెగ‌లు రేపుతోంది. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సంబంధ‌ముంద‌ని ఆరోపిస్తూ బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆమె ఇంటిని ముట్ట‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేసి పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. దీన్ని నిర‌సిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మండ‌లం పామ్నూరులో పాద‌యాత్ర శిబిరం వ‌ద్ద దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేసి ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంద‌ని స‌మాచారం. బండి సంజ‌య్‌ను అరెస్టు చేయ‌నీయ‌కుండా పెద్ద ఎత్తున బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న చుట్టూ చేరారు. మ‌రోవైపు వంద‌ల సంఖ్య‌లో పోలీసులు కూడా మోహ‌రించారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు అతిక‌ష్టం మీద బండి సంజ‌య్‌ను అరెస్టు చేసి పోలీసు వాహ‌నంలోకి ఎక్కించారు.

అయితే మార్గంమధ్యలో పోలీసు వాహనాలను బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగించారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయ‌ప‌డ్డారు.

కాగా.. బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించార‌ని చెబుతున్నారు.

ఇక టీఆర్ఎస్ దాడి నేపథ్యంలో భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధం కాగా ఆ భద్రతను బండి సంజ‌య్ తిరస్కరించార‌ని స‌మాచారం. త‌న భ‌ద్ర‌త‌ను బీజేపీ కార్య‌క‌ర్త‌లే చూసుకుంటార‌ని ఆయ‌న తేల్చిచెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు వివాదాస్ప‌ద వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశార‌నే ఫిర్యాదుల‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాజాసింగ్ పోస్టు చేసిన వీడియో ముస్లింల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉంద‌ని ఆయ‌న‌పై ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో మ‌జ్లిస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆయ‌న వ్యాఖ్య‌లు త‌మ మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర్చాయ‌ని ఫిర్యాదు చేశారు. దీంతో రాజాసింగ్‌ను షాహినాయ‌త్ గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.