Begin typing your search above and press return to search.

లిక్కర్ లేడీలు.. తెలంగాణలో రికార్డ్

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:55 AM GMT
లిక్కర్ లేడీలు.. తెలంగాణలో రికార్డ్
X
ఏదైనా ఇంట్లో ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవిగా కొలిచే సంప్రదాయం మనలో ఉంది. ఆడబిడ్డ గజ్జెలు వేసుకొని నట్టింట్లో నడుస్తుంటే లక్ష్మీదేవి కటాక్షం దక్కుతుందని నమ్ముతారు. అందుకే అదృష్టం, లక్ పై ఆధారపడే వ్యాపారాలను ఆడబిడ్డలతోనే ప్రారంభిస్తారు వ్యాపారులు. ఇప్పుడూ అదే జరిగింది. తెలంగాణలో నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్ షాపుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో మహిళలు పెద్ద ఎత్తున టెండర్లు వేసి ఆశ్చర్యపరిచారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి.

నవంబర్ 1 నుంచి తెలంగాణలో కొత్త మద్యం పాలసీతోపాటు కొత్త మద్యం షాపులు కూడా వెలుస్తాయి. వాటిని దక్కించుకోవడానికి వ్యాపారులు ఆడబిడ్డల అదృష్టాన్ని వినియోగించుకున్నారు. తమ తల్లి, కూతుళ్లు, భార్య, కోడళ్ల పేరుతో టెండర్లు వేశారు. ప్రధానంగా జంట జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డిలల్లో ఉన్న మొత్తం 595 షాపులకు 8692 మంది టెండర్లు వేస్తే అందులో మహిళలే ఏకంగా 3000 వరకు టెండర్లు వేయడం విశేషంగా మారింది. మొత్తం 8692 దరఖాస్తుల్లో బుధవారం చివరి రోజు ఒక్కరోజే ఏకంగా 5064 మంది టెండర్లు వేయడం విశేషం.

మద్యం టెండర్లకు వేసిన దరఖాస్తులతోనే ఎక్సైజ్ శాఖకు ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 173.84 కోట్ల ఆదాయం రావడం విశేషం. మద్యానికి ఆడవాళ్లు ఎంతో దూరం. దాని వాసన కూడా వాళ్లకు పడదు. కానీ అదే మద్యం షాపులను దక్కించుకోవడానికి ఈ అదృష్టలక్ష్మీలను మద్యం వ్యాపారులు రంగంలోకి దింపడం విశేషం. మరి వారి లక్కు ఏమవుతుందనేది ఈరోజు తీసే డ్రాతో తేటతెల్లమవుతుంది.