Begin typing your search above and press return to search.

ఆ రోజున గ్రేటర్ లో రూ.120కోట్లు తాగేశారు

By:  Tupaki Desk   |   2 Jan 2016 5:44 AM GMT
ఆ రోజున గ్రేటర్ లో రూ.120కోట్లు తాగేశారు
X
అర్థరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉంచే పబ్ లు.. అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ బార్లా తెరిచి ఉంచేలా బార్లు తెరిచి ఉంటే ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నకు సరైన సమాధానమే చెప్పారు గ్రేటర్.. శివారులో నివసించే హైదరాబాదీయులు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం వ్యాపార వేళల్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అధికారులు అంచనా వేసినట్లే.. డిసెంబరు 31 ఒక్కరోజునే భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి డిసెంబరు 31 రాత్రిన రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని.. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి రూ.50కోట్ల మేర అదనంగా వ్యాపారం జరిగినట్లుగా వెల్లడిస్తున్నారు.

అధిక సమయం తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకోవటం కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరగటానికి కారణంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 31 ఒక్కరోజునే రూ.200కోట్ల మద్యం బిజినెస్ జరిగిందని తేల్చారు. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్.. శివారుల్లోనే దాదాపు రూ.120కోట్ల బిజినెస్ సాగటం విశేషం. గతానికి ఈసారి డిసెంబరు 31 నైట్ లో కనిపించిన వ్యత్యాసాల గురించి వివరిస్తూ.. ఈసారి విదేశీ మద్యాన్ని పెద్దఎత్తున వినియోగించినట్లుగా తెలుస్తోంది.

ఒక్క డిసెంబరు 31 రాత్రి మాత్రమే కాదు.. మొత్తంగా డిసెంబరు నెలలోనూ భారీగానే మద్యం అమ్మకాలు సాగినట్లు చెబుతున్నారు. 2014 డిసెంబరులో రూ.1005కోట్ల వ్యాపారం జరిగితే.. 2015 డిసెంబరులో రూ.1250కోట్ల బిజినెస్ జరిగిందని తేల్చారు. అంటే.. రూ.245కోట్లు ఎక్కువన్న మాట. ఇందులో రూ.50కోట్లు ఒక్క డిసెంబరు 31 నాటి అమ్మకాలు ఉండటం గమనార్హం.