Begin typing your search above and press return to search.

పొద్దున దండేసి చేతికి బాటిల్ ఇస్తే.. సాయంత్రానికి అలా అయ్యాడు

By:  Tupaki Desk   |   7 May 2020 6:50 AM GMT
పొద్దున దండేసి చేతికి బాటిల్ ఇస్తే.. సాయంత్రానికి అలా అయ్యాడు
X
మద్యం అమ్మకాల్ని మొదలు పెట్టిన మొదటి రోజునే తెలంగాణ లో రచ్చ సీన్లు చాలానే కనిపించాయి. ఎక్కడి దాకానో ఎందుకు? హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న మూడు ఉదంతాలుచూస్తే చాలు.. మద్యం అమ్మకాలు ఎన్ని దారుణాల్ని తీసుకొస్తాయో ఇట్టే అర్థమైపోతుంది. ఇలాంటివి చూసినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా ఫర్లేదు.. మద్యాన్ని అమ్మకుంటే మంచిదేమో అన్న భావన కలుగక మానదు.

సీన్ నెంబరు 1
అది హైదరాబాద్ లోని ఇందిరా నగర్ లోని సాయి వైన్సు. మద్యం అమ్మకాలు షురూ కావటంతో పొద్దు పొద్దున్నే పెద్ద ఎత్తున మందుబాబులు వైన్ షాపు ముందు బారులు తీరారు. ఉదయం పది గంటలకు అమ్మకాలు ప్రారంభించాల్సిన నేపథ్యంలో 9.50కు మొదటి కస్టమర్ మెడలో పూలదండ వేసిన వైన్ షాపు యాజమాన్యం.. అతని చేతికి శానిటైజర్ తో క్లీన్ చేసుకోవాలని చెప్పి మరీ.. చేతిలో బాటిలో పెట్టారు.

కట్ చేస్తే.. సాయంత్రానికి అదే వ్యక్తి ఫుల్ గా మందు కొట్టేసి.. అర్థనగ్నంగా మారి హడావుడి చేయటం షురూ చేశారు. పొద్దున్న రాముడు మంచి బాలుడు టైపులో.. మందు షాపు వద్ద ఎంతో ఒద్దికతో కనిపించిన అతగాడు.. సాయంత్రం ఫుల్ గా తాగేసిన తర్వాత వీధిలో రచ్చ చేయటం కనిపించింది.

సీన్ నెంబరు 2
సిటీలోని బర్కత్ పురకు చెందిన ముప్ఫై ఏళ్ల మహేశ్ గౌలిగూడలోని ఒక వైన్ షాపు వద్ద మద్యాన్ని కొనుగోలు చేవాడు. ఇంటికి వెళ్లి తాగేంత సేపు వెయిట్ చేయలేక.. మద్యం షాపుకు పక్కనే వెళ్లి ఫుల్ గా తాగేశాడు. కొద్ది రోజులుగా మందు చుక్క పడని ఒంటికి.. ఫుల్ గా ఎక్కేసేసరికి.. తానేం చేస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు.తాగిన మైకంలో ట్రాన్స్ ఫార్మర్ ను పట్టేసుకున్నాడు. దీంతో.. షాక్ కొట్టి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి.. డెడ్ బాడీని ఉస్మానియా మార్చురికి తరలించారు.

సీన్ నెంబరు 3
ఉప్పుగూడ రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన యాభై ఎనిమిదేళ్ల రాజు అనే వ్యక్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మద్యం అమ్మకాలు ప్రారంభమైన మొదటి రోజునే.. మద్యం ఎన్ని దారుణాలకు కారణమవుతుందన్న విషయం తెలిసేలా ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఫుల్ గా తాగేసిన అతడు.. బుధవారం రాత్రి రాయుడు అనే నలభై ఎనిమిదేళ్ల వ్యక్తిపై దాడికి దిగాడు. దీంతో రంగంలోకి దిగిన ఛత్రినాక పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు.