Begin typing your search above and press return to search.

అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ప్యారిస్ ను వెనక్కి నెట్టిన నగరం ఏది..?

By:  Tupaki Desk   |   2 Dec 2021 10:30 AM GMT
అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ప్యారిస్ ను వెనక్కి నెట్టిన నగరం ఏది..?
X
కరోనా మహమ్మారి వల్ల ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఒకప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసేటటువంటి ప్రజలు... ఈ మహమ్మారి పుణ్యమా అని రూపాయి బయటకు తీయాలంటే వెనకాడుతున్నారు. అయితే ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాన్ని ఎంపిక చేసింది. పెరిగిన వస్తువుల ధరలు, ప్రజల కొనుగోలు శక్తి, ఇంటికి చెల్లించే అద్దెలు, వస్తువుల విక్రయాలు, ఇండ్ల స్థలాల ధరలు, రోజు ఖర్చు చేసి చిల్లర ఖర్చులతో సహా అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఇటీవలే విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు గా ఉన్నటువంటి రష్యా, చైనా, అమెరికా వంటి దేశాల నుంచి ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే పైన పేర్కొన్న ఈ ఒక్క దేశం నుంచి కూడా ఖరీదైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఎంపిక కాలేదు.

కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఏ నగరంలో అయితే ఎక్కువ ఉంటుందో ఆ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పేర్కొంటారు. అయితే ఈసారి కాస్ట్ ఆఫ్ లివింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఇజ్రాయిల్కు చెందింది. ఈ దేశంలోని టెల్ అవీవ్ అనే నగరం ఖరీదైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. గతంతో పోల్చి చూస్తే ఈ నగరం సుమారు 5 నగరాలను వెనక్కి నెట్టి మొదటి సారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం లో సుమారు 170కి పైగా నగరాల్లో వస్తు సేవలను అంచనా వేసి జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాను విడుదల చేసిన సంస్థ పేరు ఎకనమిస్ట్ ఇంటెలిజెట్ యూనిట్. ఈ సంస్థ కొన్ని అంశాలను ప్రమాణికంగా చేసుకుని ప్రతి ఏడాది ఖరీదైన నగరాల జాబితా ప్రచురిస్తుంది. అయితే తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన ఖరీదైన నగరాల జాబితాలో మొదటి పది స్థానాల్లో భారత దేశం నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక కాలేదు. ఈ ఎంపిక అనేది అమెరికన్ కరెన్సీ అయినటువంటి డాలర్ ను ప్రామాణికంగా చేసుకొని అక్కడి ప్రజలు చేసేటువంటి ఖర్చులను అంచనా వేసింది. డాలర్‌తో పోలిస్తే ఇజ్రాయెల్ జాతీయ కరెన్సీ అయిన షెకెల్ చాలా బలంగా ఉంది. అలాగే రవాణా, కిరాణా సామాగ్రి ధరలు పెరగడం వల్ల టెల్ అవీవ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది.

అక్కడి ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఆ నగరం లో వస్తు సేవలు గతేడాది తో పోల్చి చూసినట్లయితే సుమారుగా 3 శాతానికి పైగానే పెరిగాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సమయంలో కూడా ఇక్కడి ప్రజల కొనుగోలు స్థాయి ఏమాత్రం తగ్గలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది అంతేకాకుండా ప్రజలు ఆర్థికంగా మరింత పుంజుకుంటున్నట్లు తేలింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నగరం లో వ్యాపారం కొంతమేర దెబ్బతిన్నట్లు గణాంకాలు వివరించాయి.

గతేడాది ఈ సర్వేలో ప్యారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ లు మొదటి స్థానంలో నిలిచాయి. అయితే ఈ ఏడాది పారిస్, సింగపూర్ లు సంయుక్తంగా రెండవ స్థానానికి పరిమితం అయ్యాయి. ఆ తరువాత జ్యూరిచ్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ జాబితాలో న్యూయార్క్ ఆరో స్థానంలో, జెనీవా ఏడో స్థానంలో నిలిచాయి.