Begin typing your search above and press return to search.

జార్ఖండ్ ఫలితాలు.. పోటాపోటీగా బీజేపీ.. కాంగ్రెస్

By:  Tupaki Desk   |   23 Dec 2019 6:13 AM GMT
జార్ఖండ్ ఫలితాలు.. పోటాపోటీగా బీజేపీ.. కాంగ్రెస్
X
ఆసక్తిగా ఎదురుచూస్తున్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటం షురూ అయ్యింది.ఈ రోజు (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని తొలుత అనుకున్నా పౌరసత్వ సవరణ చట్టం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థితులు అనూహ్యంగా మారాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని పేర్కొన్నాయి.

రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 41 స్థానాల్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు ఐదు విడతల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ ఉదయం నుంచి సాగుతోంది. ఓట్ల లెక్కింపు మొదలైన తొలి గంట ఫలితాల్ని చూస్తే.. కాంగ్రెస్.. జేఎంఎం.. ఆర్జేడీ కూటమి 35 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. అధికార బీజేపీ 25 స్థానాల్లో అధిక్యతలో కొనసాగుతోంది.

ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రిగా ఉన్న రఘుబర్ దాస్ వెనుకబడి ఉన్నప్పటికీ.. తర్వాత ఆయన పుంజుకున్నారు. మరోవైపు జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తొలి గంట ఫలితాలు పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకూ పలు మలుపులు తిరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.