Begin typing your search above and press return to search.

అద్వానీని చల్లబర్చడానికి బీజేపీ కొత్త వ్యూహం?

By:  Tupaki Desk   |   6 April 2019 1:29 PM GMT
అద్వానీని చల్లబర్చడానికి బీజేపీ కొత్త వ్యూహం?
X
భారతీయ జనతా పార్టీలోని పరిణామాల పట్ల సీనియర్ నేత ఎల్ కే అద్వానీ చాలా అసహనంతో ఉన్నారనే విషయం స్పష్టం అవుతూనే ఉంది. ఇది ఇప్పటి నుంచి ఐదేళ్లకు పై నుంచినే అద్వానీ చాలా అసహనంతో ఉన్నారు. మోడీని గత ఎన్నికల ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే అద్వానీ తీవ్ర అసంతృప్తుడయ్యారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు అయిన అద్వానీ తన చిరకాల వాంఛ అయిన ప్రధాని పదవిని దక్కించుకోలేకపోయారు.

మోడీ ప్రధాని అభ్యర్థిగా రావడంతోనే అద్వానీ అవకాశాలు మరుగయిపోయాయి. ఆ తర్వాత కూడా మోడీ పట్ల అద్వానీ అంత సానుకూలంగా లేరు. ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత కూడా అద్వానీకి ఎలాంటి కీలకమైన పదవీ ఇవ్వలేదు. రాష్ట్రపతి పదవిని ఆఫర్ చేస్తారని వార్తలు వచ్చినా అది కూడా జరగలేదు.

ఇక వయసు కారణాన్ని చూపి ఈ ఎన్నికల్లో అద్వానీని పోటీ నుంచి కూడా తప్పించేశారు. ఆ తర్వాత అద్వానీ బ్లాగ్ పోస్టు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వాళ్లలోనే అద్వానీ బ్లాగ్ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఆ సీనియర్ నేత అసహనంతో ఉన్నారని స్పష్టం అవుతోంది ఆ పోస్టుతో.

ఈ నేఫథ్యంలో అద్వానీని చల్లబరచడానికి ఆయన కూతురును రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు అనుకుంటున్నారట. అద్వానీ కూతురు ప్రతిభను మధ్యప్రదేశ్ లోని బరోడా నుంచి ఆమెను పోటీ చేయించాలని బీజేపీ అనుకుంటోందట. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున దిగ్విజయ్ సింగ్ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి అద్వానీ కూతురును పోటీ చేయించాలని బీజేపీ అనుకుంటోందట. మరి దీనిపై అద్వానీ ఎలా స్పందిస్తారో చూడాలి!