Begin typing your search above and press return to search.

అంద‌రూ ఉన్నారు కానీపెద్దాయ‌న మిస్ అయ్యారేంది మోడీ?

By:  Tupaki Desk   |   27 April 2019 6:00 AM GMT
అంద‌రూ ఉన్నారు కానీపెద్దాయ‌న మిస్ అయ్యారేంది మోడీ?
X
కాంగ్రెస్ క‌టౌట్‌ లో ఇందిర‌మ్మ‌.. రాజీవ్ లు లేకుండా ఊహించ‌గ‌ల‌మా? తెలుగుదేశం పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ బొమ్మ లేకుండా సాధ్య‌మా? వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌చారంలో వైఎస్ ప్ర‌స్తావ‌న లేని వైనం ఉంటుందా? వీట‌న్నింటికి నో అనే చెబుతారు. మ‌రి.. బీజేపీకి అస‌లుసిస‌లు పిల్ల‌ర్.. ఈ రోజున బీజేపీ ఇంత బ‌లంగా ఉండ‌టానికి మూల‌కారకుల్లో ఒక‌రు.. పెద్దాయ‌న‌గా పేరొందిన లాల్ కృష్ణ అద్వానీని మిస్ చేయ‌టంలోనూ.. ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టంలో బీజేపీ త‌ర్వాతే ఏ పార్టీ అయినా. త‌న‌ జీవితంలో ఇలాంటి ప‌రిస్థితి ఒక‌టి ఏర్ప‌డుతుంద‌ని అద్వానీ ఎప్పుడూ అనుకొని ఉండ‌క‌పోవ‌చ్చేమో?

పెద్దల్ని గౌర‌వించ‌టంలో త‌న‌కు మించినోళ్లు లేర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే మోడీ నేతృత్వంలో బీజేపీ ఇప్పుడు ఊహ‌కు అంద‌ని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ మ‌ధ్య‌న ప‌బ్లిక్ మీటింగ్ లో చేతులు జోడించిన అద్వానీని లైట్ తీసుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆయ‌న అభివాదాన్ని అస్స‌లు ప‌ట్టించుకోని మోడీ తీరుపై గ‌తంలో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఏ మాట‌కు ఆ మాటే చెప్పాలి. మోడీసాబ్.. అలాంటి విమ‌ర్శ‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోరు.

తాజాగా వార‌ణాసి బ‌రిలో నిలిచిన ప్ర‌ధాని మోడీ త‌న నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించారు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా మొద‌లు.. కేంద్ర‌మంత్రులు రాజ్ నాథ్ సింగ్.. సుష్మా స్వ‌రాజ్.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ లాంటి ప‌లువురు ప్ర‌ముఖులు ఉన్నారు. సొంత పార్టీ నేత‌ల‌తో పాటు.. ఎన్డీయే మిత్రులైన బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్.. ఎల్ జేపీ అధ్య‌క్షుడు రాంవిలాస్ పాశ్వాన్.. శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ ఠాక్రే.. అకాలీద‌ళ్ కురువృద్ధుడు ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ ఉన్నారు.

ఈ మొత్తం క‌టౌట్ లో ఓ పెద్ద లోటు ఏమిటంటే.. బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ క‌నిపించ‌క‌పోవ‌టం. బీజేపీ పెద్ద దిక్కుగా చెప్పుకునే అద్వానీని మోడీ త‌న నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మానికి అస‌లు పిలిచారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. అంత‌మంది పార్టీ ప్ర‌ముఖుల్ని.. మిత్రుల్ని పిలిచిన మోడీకి.. అద్వానీ ఒక్క‌రే ఎక్కువ‌య్యారా? ఎందుకిలా చేస్తున్నారు. త‌న‌ను పెంచి పెద్ద చేసిన గురువును గౌర‌వించని మోడీలాంటి శిష్యుడు దేనికి నిద‌ర్శ‌న‌మంటారు?