Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న‌కు చివ‌ర‌కు మిగిలింది ఇదేనా?

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:51 AM GMT
పెద్దాయ‌న‌కు చివ‌ర‌కు మిగిలింది ఇదేనా?
X
రెండు అంటే రెండు లోక్ స‌భా స్థానాలు మాత్ర‌మే ఉన్న ఒక పార్టీని.. దేశంలో తిరుగులేని శ‌క్తిగా మార్చ‌టం సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అంటే కాద‌ని చెప్పాలి. కానీ.. అది సాధ్య‌మేన‌న్న విష‌యాన్ని చాటి చెప్పిన రాజ‌కీయ పార్టీ బీజేపీ. పార్టీని అంత‌లా బ‌లోపేతం చేసిన రాజ‌కీయ నేత ఎల్ కే అద్వానీ. బీజేపీ ఈ రోజు ఇంత భారీగా పెరిగినా.. తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించినా.. స‌మీప భ‌విష్య‌త్తులో ఆ పార్టీ తిరుగులేని శ‌క్తిగా మారినా.. అందుకు బ‌ల‌మైన పునాదులు వేసింది అద్వానీ.. వాజ్ పేయ్ లేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అనారోగ్యం కార‌ణంగా కొన్నేళ్లుగా బ‌య‌ట‌కు రాకుండా (రానివ్వ‌కుండా) ఉండిపోయారు వాజ్ పేయ్‌. ఇక‌.. మిగిలింది ఎల్ కే అద్వానీనే. పాత నీటిని డామినేట్ చేస్తూ కొత్త నీరు మొత్తాన్ని ఆక్ర‌మిస్తున్నా.. చూస్తూ ఊరుకుండిపోతున్నారే త‌ప్పించి.. త‌న ఆస్తిత్వాన్ని ప్ర‌శ్నించాల‌ని ఎంత‌కూ అనుకోక‌పోవ‌టం చూసిన‌ప్పుడు అద్వానీలో అభిన‌వ భీష్ముడు క‌నిపించ‌క మాన‌డు. పెంచి పెద్ద చేసిన పార్టీనే కాదు.. త‌న చేతుల‌తో అడుగులు వేయించి.. త‌ప్ప‌ట‌డుగులు వేస్తే స‌రిదిద్ది.. ద‌న్నుగా నిలిచి.. ఈగ వాల‌కుండా చేసి.. ఇంత పెద్ద మోడీని చేసిన అద్వానీకి చివ‌ర‌కు మిగిలింది ఏమిటి? అన్న ప్ర‌శ్న వేసుకున్న‌ప్పుడు అయ్యో అనిపించే స‌మాధాన‌మే మిగులుతుంది.

రాజ‌కీయపక్షాలే కాదు దేశ ప్ర‌జ‌లంతా ఒక్క‌టే మాట మీద నిల‌బ‌డే అతి కొద్ది అంశాల్లో.. బీజేపీ కురువృద్ధుడికి దారుణ‌మైన అన్యాయం జ‌రిగిందన్నది ఒక‌టి. తిరుగులేని అధికారానికి చేరుకునేలా పార్టీని త‌యారు చేసిన‌ప్ప‌టికీ.. వాటి ఫ‌లాలు ఏ ఒక్క‌టి సొంతం కాన‌ప్పుడు క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. మోడీ లాంటి శిష్యుడు ఉన్న‌ప్పుడు అద్వానీ లాంటి గురువుకు ఇలాంటి మ‌ర్యాద‌లే ద‌క్కుతాయేమో.

భార‌త దేశ ప్ర‌ధానిగా కాదూ కూడ‌దంటే రాష్ట్రప‌తిగా అయినా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌న్న కోరిక అద్వానీలో ఉంద‌న్న‌ది నిజం. పెద్దాయ‌న‌గా త‌న మ‌న‌సులోని కోరిక‌ను బాహాటంగా బ‌య‌ట‌పెట్టుకోవ‌టం లేదన్న‌ది నిజం. ఒక‌వేళ బ‌య‌ట‌పెట్టుకున్నా అవ‌మాన‌మే మిగులుతుంద‌న్న విష‌యం మీద స్ప‌ష్ట‌త ఉన్న‌ప్పుడు నోరుమూసుకొని ఉండ‌టం మంచిది. అద్వానీ ఇప్పుడు అదే చేస్తున్నారు.

కేంద్రంలో స‌ర్కారు కొలువు తీరితే.. అద్వానీ రాష్ట్రప‌తి కావ‌టం ఖాయ‌మ‌న్న మాట ఇప్ప‌టిది కాదు. ఎన్నో ఏళ్ల కింద‌టే ఫిక్స్ అయ్యింది. కానీ.. అలా అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌రిగితే మోడీ గురించి ఇంత మాట్లాడుకోవాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు క‌దా. తన‌ను పెంచి పెద్ద‌చేసిన అద్వానీ విష‌యంలో మోడీ ఎందుకంత క‌ర‌కుగా ఉంటారో ఎవ‌రికీ అర్థం కానిది. బ‌ల‌మైన నేత‌ను కీల‌క‌మైన ప‌ద‌వుల్లో కూర్చోబెడితే.. పార్టీలో రెండు ప‌వ‌ర్ స్టేష‌న్ల‌ను తానే ఏర్పాటు చేసిన‌ట్లు అవుతుంద‌న్న భావ‌న కూడా అద్వానీని వీలైనంత దూరంగా పెట్ట‌టానికి కార‌ణంగా చెబుతారు.

రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చోబెట్టే విష‌యంలో గురువుకు శిష్యుడు హ్యాండ్ ఇవ్వ‌టం గ్యారెంటీ అన్న మాట ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న‌దే. చివ‌ర‌కు అదే జ‌రిగింది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇక అద్వానీ రాష్ట్రప‌తి అయ్యే అవ‌కాశాన్ని శాశ్వితంగా కోల్పోయిన‌ట్లే. అంటే.. త‌న జీవితంలో తాను కోరుకున్న‌దేదీ అద్వానీకి ద‌క్క‌లేద‌న్న‌ది అన్నింటికి మించిన విషాదం. పెద్దాయ‌న‌గా పేరున్న‌ప్ప‌టికీ.. కాలం మొగ్గు చూపిన ప‌వ‌ర్‌కే పాదాక్రాంత‌మ‌వుతున్న క‌మ‌ల‌నాథులు.. అద్వానీని ఎంత క్షోభ‌కు గురి చేస్తున్న విష‌యాన్ని గుర్తించ‌న‌ట్లుగా ఉండిపోయార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అద్వానీకి చివ‌ర‌కు మిగిలింది ఏమిటంటే.. ఉత్స‌వ విగ్ర‌హంగా మారి.. తాను కూర్చోవాల్సిన సీట్లో కూర్చునే వ్య‌క్తి గౌర‌వ పూర్వ‌కంగా క‌లిసి వెళ్ల‌టం.. ఆయ‌న్ను ఆశీర్వ‌దించ‌టం మాత్ర‌మే. వీట‌న్నింటి బ‌దులు.. త‌న‌ను ఇంత‌గా అవ‌మానించిన పార్టీకి దూరంగా అద్వానీ వెళ్లిపోవ‌చ్చు క‌దా అని కొంద‌రికి అనిపిస్తుంది. కానీ.. పెంచి.. పెద్ద చేసిన కొడుకు ఎంత‌కూ ప‌ట్టించుకోకున్నా.. ఏ త‌ల్లి మాత్రం కొడుకును విడిచి వెళ్లిపోవాల‌నుకోదు క‌దా. అద్వానీది కూడా ఇంచుమించు అలాంటి పిచ్చి ప్రేమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/