Begin typing your search above and press return to search.

అద్వానీకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:46 AM GMT
అద్వానీకి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ కురువృద్ధుడిగా పేరుగాంచిన లాల్ కృష్ణ అద్వానీ... మ‌న‌కంద‌రికీ చిర‌ప‌ర‌చితులైన ఎల్కే అద్వానీగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నుంచి దాదాపుగా పిలుపు వ‌చ్చేసిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం వ‌చ్చే జూలైలో ముగియ‌నుంది. పూర్వాశ్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నేత‌గా, ఆ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్‌ గా... స‌మ‌స్య‌ల‌ను చిటికెలో ప‌రిష్క‌రించేసిన నేత‌గా ఆయ‌న‌కు మంచి పేరే ఉంది. యూపీఏ స‌ర్కారులో మ‌న్మోహన్ సింగ్ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసిన ప్ర‌ణ‌బ్... ప్ర‌తిభా పాటిల్ రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన మ‌రుక్ష‌ణ‌మే రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ద‌క్కేసింది. ఆ త‌ర్వాత యూపీఏ స‌ర్కారు గ‌ద్దె దిగి... ఎన్డీఏ స‌ర్కారు పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ స‌ర్కారుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ణ‌బ్‌కు సెకండ్ ట‌ర్మ్ కూడా రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం ద‌క్క‌డం ఖాయ‌మ‌న్న వాద‌న కూడా వినిపించింది.

అయితే బీజేపీకి కొత్త ఊపిరులూది... కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే స్థాయికి చేర్చిన ఎల్కే అద్వానీకి మాత్రం మోదీ కేబినెట్‌ లో బెర్తు దొర‌క‌లేదు. త‌రాల మ‌ధ్య అంత‌ర‌మే అద్వానీని... మోదీకి దూరం చేసింద‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో త‌న అసంతృప్త గ‌ళాన్ని బ‌హాటంగానే వినిపించిన అద్వానీ... త‌న‌కూ ఏదో ఓ అవ‌కాశం క‌ల్పించాల్సిందేన‌న్న వాద‌న‌ను వినిపించారు. ఈ క్ర‌మంలో అద్వానీకి త‌గిన ప‌ద‌వి... రాష్ట్ర‌ప‌తి పోస్టు ఒక్క‌టే క‌నిపించింది. దీంతో అద్వానీని... ప్ర‌ణ‌బ్ త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తిగా చేసేసేందుకు మోదీ దాదాపుగా నిర్ణ‌యం తీసేసుకున్న‌ట్లుగానే ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ణ‌బ్‌ కు సెకండ్ ట‌ర్మ్ రాష్ట్ర‌ప‌తి అవ‌కాశం ఇచ్చేది లేద‌న్న విష‌యం అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా మోదీ స‌ర్కారు నిన్న కీల‌క నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి దిగిపోయిన నేత‌లు... ఆ త‌ర్వాత ఢిల్లీలోని రైసినా హిల్స్‌ కు చెందిన 10 రాజాజీ మార్గ్‌ లో నివాసం ఉంటారు. ఇది ఎన్నాళ్ల నుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ. ఆ ఆన‌వాయితీని కొన‌సాగిస్తున్న‌ట్లుగానే కాకుండా... రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌ణ‌బ్‌ ను రెండు ట‌ర్మ్ కొన‌సాగించే అవ‌కాశాలు లేవ‌ని అర్థం వ‌చ్చేలా... ప్ర‌ణ‌బ్‌ కు 10 రాజాజీ మార్గ్‌ ను నివాసంగా కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన మ‌రుక్ష‌ణ‌మే ప్ర‌ణ‌బ్‌... 10 రాజాజీ మార్గ్‌కు త‌న మ‌కాంను మార్చ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ భ‌వంతిలో కేంద్ర మంత్రి మ‌హేశ్ శ‌ర్మ ఉంటున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం ద‌రిమిలా... ఏ క్ష‌ణాన్నైనా తాను ఆ భ‌వంతిని ఖాళీ చేసి... త‌న‌కు కొత్త‌గా కేటాయించే భ‌వంతిలోకి మారిపోతాన‌ని శ‌ర్మ కూడా నిన్న‌నే ప్ర‌క‌టించేశారు. అంటే... జూలైలో ప్ర‌ణ‌బ్ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను ఖాళీ చేయ‌గానే... అందులోకి అద్వానీ చేరిపోతార‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/