Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ మంత్రికి కూడా లోన్ యాప్ వేధింపులా?

By:  Tupaki Desk   |   29 July 2022 12:30 PM GMT
ఏపీలో ఆ మంత్రికి కూడా లోన్ యాప్ వేధింపులా?
X
ఇప్పుడు దేశంలో లోన్ యాప్స్ అరాచ‌కాలు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా చైనా దేశానికి చెందిన లోన్ యాప్స్ కొద్ది నిమిషాల్లోనే ఎలాంటి ఫిజిక‌ల్ డాక్యుమెంట్లు లేకుండా, లోన్ కావాల్సిన‌వారు ఎక్క‌డికీ వెళ్ల‌కుండానే ఉన్న‌చోట‌నే ఫోన్ ద్వారా క్ష‌ణాల్లో లోన్లు మంజూరు చేస్తున్నాయి. ప్ర‌జ‌లు త‌మ ఆర్థికావ‌స‌రాల‌తో వీటిని ముందు వెనుక చూసుకోకుండా ఓకే చేసేస్తున్నారు. లోన్ యాప్స్ అడిగిన నిబంధ‌న‌లన్నింటికీ ఓకే కొడుతున్నారు.

ఇక ఆ త‌ర్వాత నుంచి లోన్ యాప్స్ చుక్క‌లు చూపిస్తున్నాయి. అధిక వ‌డ్డీలు వ‌సూలు చేయ‌డం, మొత్తం క‌ట్టేసినా ఇంకా క‌ట్టాల్సింది ఉంద‌ని బెదిరించ‌డం, క‌ట్ట‌క‌పోతే మ‌న ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న‌వారందరికీ మ‌న గురించి చెడుగా ప్ర‌చారం చేయ‌డం, సోష‌ల్ మీడియాలో న‌గ్న చిత్రాలు పోస్టు చేయ‌డం ఇలా ఎన్నో దారుణాల‌కు తెగిస్తున్నాయి. వీటి బాధ‌ను త‌ట్టుకోలేక చాలామంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా ఏకంగా ఒక మంత్రికే లోన్ యాప్ నిర్వాహ‌కులు ఫోన్ చేసి బెదిరించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వివ‌రాల్లోకెళ్తే.. కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే. అంతేకాకుండా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కూడా.

అయితే ఆయన లోన్ తీసుకోకుండానే ఈ యాప్ బాధితుడిగా మారడం విశేషం. లోన్ తీసుకోకపోయినా అశోక్ అనే లోన్ తీసుకున్న వ్య‌క్తి ఫోన్ లో మంత్రిగారి నంబర్ ఉందన్న కారణంతో ఆయన ఫోన్ కు కాల్స్ చేసి వేధించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో మంత్రి గారి పీఏ శంకర్ ఈ ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయడం, తమకు సంబంధం లేదని చెప్పినా వినకుండా లోన్ యాప్ నిర్వాహకులు బూతులు తిట్ట‌డం చేశారు. దీంతో మంత్రి పీఏ ఫోను పెట్టేశార‌ని అంటున్నారు.

అయినా స‌రే వ‌దిలిపెట్ట‌కుండా లోన్ యాప్ నిర్వాహకుల నుంచి తరచూ ఫోన్ కాల్స్ రావడం, డబ్బులిస్తారా లేదా అంటూ తిడుతుండటంతో మంత్రి పీఏ శంకర్..ఈ గోలంతా ఎందుకని ఓ పాతికవేలు లోన్ యాప్ నిర్వాహ‌కుల‌కు చెల్లించార‌ని స‌మాచారం. అయినా కాల్స్ ఆగకపోవడంతో నెల్లూరులోని ముత్తుకూరు పోలీసు స్టేష‌న్ లో ఆయ‌న ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చెన్నైలో ఉన్న‌ కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బు రికవరీ కోసం ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ సంస్థ నుంచి 8.50 లక్షల లోన్ తీసుకున్న అశోక్ అనే వ్యక్తి ఫోన్ లో ఉన్న వారికి ఈ వేధింపు కాల్స్ వెళ్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి గారి ఫోన్ కూ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో చెన్నైకి చెందిన నలుగురు రికవరీ ఏజంట్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి లాప్ టాప్, నాలుగు మొబైల్స్, పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.