Begin typing your search above and press return to search.

బాబు, కేసీఆర్ క‌లిసి దారి చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   17 March 2016 5:14 AM GMT
బాబు, కేసీఆర్ క‌లిసి దారి చూపిస్తున్నారు
X
రుణ‌మాఫీ..గ‌త ఎన్నిక‌ల్లో ఈ హామీ చూపిన ప్ర‌భావం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడంలో రైతుల రుణమాఫీ పథకం కీలక పాత్ర పోషించింది అన‌టంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణ‌లో కూడా ఈ హామీ ఓట్ల‌ను ప్ర‌భావితం చేసింది. అయితే సేమ్ టు సేమ్ హామీ ఇపుడు పొరుగు రాష్ట్రం త‌మిళానాడులో తెర‌మీద‌కు వ‌చ్చింది.

తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో అధికారం పొందేందుకు ఎవరికి తోసిన పనులు వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. సీఎం సీటుకోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రచారంలో ముందుండే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తనదైన శైలిలో కొత్త పథకాలను ప్రారంభిస్తే...విపక్ష డీఎంకే కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రచారం కోసం డీఎంకే అధినేత - మాజీ సీఎం కరుణానిధి కోసం ఓ ప్రత్యేక వాహనం కూడా రెడీ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల హామీల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న ఆ నేత‌ల చూపు తెలుగు రాష్ర్టాల‌పై ప‌డింది.

త‌మిళ‌ రాజ‌కీయ పక్షాలు ప్ర‌స్తుత‌ ఎన్నికల్లో రైతుల ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాల తరహాలో రైతులకు రుణమాఫీ పథకం హామీ ప్రకటించే దిశగా పావులు కదుపుతున్నాయి. తమిళనాట ఇప్పటి వరకు ఇలాంటి పథకం అమల్లో లేదు. ఎన్నికల వేళ రైతుల ఆత్మహత్యలు, వారిపై బ్యాంకర్లు - పోలీసులు - ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులు చేస్తున్న దౌర్జన్య ఘటనలతో కలకలం రేగుతోంది. ఇక్కడ శాసనసభ ఎన్నికలన్న ప్రతిసారీ పార్టీలు ఇచ్చే హామీలను అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. దేశంలో మిగిలిన పార్టీలకు ఉచిత హామీలను నేర్పిందే తమిళ పార్టీలు కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. ఈ ఎన్నికల్లోనూ అలాంటి వాగ్దానాలు గుప్పించడానికి మేనిఫెస్టోల రూపకల్పనలో తమిళ రాజకీయ పార్టీలు ఇప్పటికే తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ పార్టీలు కూడా రుణ మాఫీ అందిపుచ్చుకునే సూచనలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయి.