Begin typing your search above and press return to search.

ఏపీలో లోకల్, ఉప ఎన్నికల ఫలితాలు ‘జంబలకిడి పంబ’

By:  Tupaki Desk   |   2 March 2021 7:30 AM GMT
ఏపీలో లోకల్, ఉప ఎన్నికల ఫలితాలు ‘జంబలకిడి పంబ’
X
ఇటీవలి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అయితే త్వరలో జరిగే ‘తిరుపతి’ ఉప ఎన్నికలో ఎటువంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే లోకల్ ఎన్నికలకు.. ఉప ఎన్నికలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఏపీ చరిత్ర చూస్తే ఆ విషయం అవగతం అవుతుంది.. చరిత్రలోకి వెళితే..

2009 సంవత్సరం అదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులవి. రెండోసారి కాంగ్రెస్ ను గెలిపించి వైఎస్ఆర్ సెకండ్ టైమ్ సీఎం కుర్చీలో కూర్చుకున్నారు. అయితే సడెన్ గా ఆయన హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించాడు. తర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య ఏర్పడింది. తండ్రి వారసత్వం దక్కకపోవడంతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి పార్టీ పెట్టాడు. ఆయనపై కేసులతో కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది. దీంతో కాంగ్రెస్ ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేశారు. వైఎస్ఆర్ మరణంతో ఖాళీ అయిన సీటు పులివెందులలో ఆయన భార్య విజయమ్మ పోటీచేయగా.. కడప ఎంపీగా జగన్ పోటీచేశారు.

అయితే నాటి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని జగన్, విజయమ్మలు చిత్తుగా ఓడించారు. విజయమ్మ దాదాపు లక్ష మెజారిటీతో పులివెందుల ఎమ్మెల్యేగా గెలవగా.. జగన్ కడప ఎంపీగా ఏకంగా 5.25 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటాడు.

ఆ తర్వాత జగన్ పై విశ్వాసంతో కాంగ్రెస్ లోని 18మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అందులో 16మందిని జగన్ మళ్లీ గెలిపించుకున్నాడు. ఆ సమయంలో టీడీపీకి 18శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 48శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు నంబర్ 1 స్థానం దక్కింది. టీడీపీ, వైసీపీలు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణలుగా విడిపోయింది. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలిచింది కేవలం 1శాతం ఓట్లతేడాతోనే.. ఆ ఒక్క శాతం ఓట్లతోనే వైసీపీ దాదాపు 30 ఎమ్మెల్యే సీట్లు పోగొట్టుకుంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ 15 రోజులు తిరిగినా టీడీపీకి 26 వేల మెజారిటీ వచ్చింది.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆఖరుకు వైఎస్ వివేకానందరెడ్డి టీడీపీ చేతిలో కూడా ఓడిపోయాడు. వైఎస్ కుటుంబంలోనే కొందరు మోసం చేసి ఓడించారనే టాక్ ఉంది.

అదే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కొనసాగింది. 50శాతం ఓట్లతో 151 సీట్లు వైసీపీ గెలిచింది. వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం మెరుగుపడ్డామని వాళ్ల లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు మారుతున్నాయని తేటతెల్లమవుతోంది. కాబట్టి ఓటరు ఎప్పటికప్పుడు మారుతున్నాడు. ఏపీ రాజకీయాల్లో పార్టీల విజయావకాశాలను మార్చేస్తున్నాడు. సమయం, సందర్భం బట్టి నిర్ణయించుకుంటున్నారు. అందుకే పార్టీలన్నీ జాగ్రత్తగా వ్యవహరించాలని మేధావులు అంటున్నారు.