Begin typing your search above and press return to search.

పడకేయనున్న ‘స్థానిక’ పాలన.. కారకులెవరు?

By:  Tupaki Desk   |   30 May 2020 1:10 PM GMT
పడకేయనున్న ‘స్థానిక’ పాలన.. కారకులెవరు?
X
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నిమ్మగడ్డ నియామకంతో ఈ ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిషనర్ చెల్లడంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లడానికి జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీంతో ఎన్నికల కమిషనర్ విషయం తేలకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం అసాధ్యం. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడుతాయా? అన్న ఆందోళన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించబడిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మళ్లీ ఎస్ఈసీగా నియామకం కానున్నారు. మహమ్మారి కారణంగా వాయిదా వేసిన ఎన్నికలను ఆయన పాత్ర ప్రక్రియ ప్రకారమే నిర్వహిస్తారా? మళ్లీ మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపడుతారా? అన్న ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చారు. మార్చి 7న షెడ్యూల్ ప్రకటించారు. అప్పుడే కరోనా మహమ్మారి విస్తరించడంతో స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వాయిదా వేశారు. దీనిపై జగన్ సీరియస్ అయ్యి ఆయనను తొలగించి ఆర్డినెన్స్ తెచ్చి కొత్త వ్యక్తిని నియమించారు. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టుకెక్కి తాజాగా విజయం సాధించి మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియామకం అయ్యారు.

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటినుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్టు న్యాయనిపుణులు చెబుతున్నారు. మూడు నెలల్లో నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికలు నిర్వహించకపోతే మళ్లీ ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాల్సి ఉంటుందంటున్నారు.

ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇప్పుడు అందంతా రద్దు అయితే మళ్లీ మొదటినుంచి మొదలైతే టికెట్లు మళ్లీ తమకే ఇస్తారా లేదా అన్న భయం అభ్యర్థుల్లో ఉంది.

ఒకవేళ అప్పటి ప్రక్రియ మొత్తం రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తే జూన్ నెలలో ఎన్నికల నిర్వహణ కష్టమే.. నైరుతి రుతుపవనాలు రావడం.. ఖరీఫ్ సీజన్ మొదలు కావడం వల్ల రైతులు పనుల్లో ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం కష్టమే. పైగా కరోనా-లాక్ డౌన్ ప్రభావం కూడా జూన్ ఆసాంతం ఉండే అవకాశం ఉంది. దీంతో ఆగస్టులోనే మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటికి కరోనా తగ్గితేనే నిర్వహిస్తారు. లేదంటే మరోసారి వాయిదానే. దీంతో స్థానిక సంస్థల్లో ఎన్నికలు లేక పాలన పడకేసే ప్రమాదం ఉంది.