Begin typing your search above and press return to search.

గిద్ద‌లూరు రెవెన్యూ అక్ర‌మాల‌కు ప్ర‌జాప్రతినిధుల అండ‌?

By:  Tupaki Desk   |   30 Dec 2019 6:09 AM GMT
గిద్ద‌లూరు రెవెన్యూ అక్ర‌మాల‌కు ప్ర‌జాప్రతినిధుల అండ‌?
X
ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెవెన్యూ అక్ర‌మాలు భారీ ఎత్తున వెలుగులోకి వ‌స్తూ ఉన్నాయి. ముడుపులే ధ్యేయంగా వీఆర్వోలు - వీఆర్ ఏ ల ఆధ్య‌ర్యంలో భారీ అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌భుత్వ భూముల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల‌కు ధార‌ద‌త్తం చేయ‌డం, ఒక‌రి పేరుతో ఉన్న భూముల‌ను మ‌రక‌రి పేర్ల మీద‌కు మార్చ‌డం... వంటి వ్య‌వ‌హారాల‌తో వీరు వివాదాల‌ను రేపుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ భూముల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల ప‌రం చేయ‌డం ద్వారా వీఆర్వోలు - వీఆర్ ఏలు భారీగా డ‌బ్బులు దండుకుంటూ ఉన్నారు. ఇక వివాదాస్ప‌ద స్థలాల‌ను కోరిన వారికి ద‌క్కేలా చేయ‌డం - ఒక‌రి పేరు మీద ఉన్న భూముల‌ను మ‌రొక‌రి పేరు మీద‌కు మార్చ‌డం.. వంటి ప‌నులు కూడా రెవెన్యూ శాఖ అధికారుల‌కు చిటికెలో ప‌నిగా మారింది.

దొంగ ప‌ట్టాల‌ను సృష్టించ‌డం - న‌కిలీ పాస్ పుస్త‌కాల సృష్టి.. వీరికి రెగ్యుల‌ర్ యాక్టివిటీస్ అయ్యాయి. ఇలాంటి అక్ర‌మాల విష‌యంలో అధికారుల‌కు గ‌ట్టి వాటాలే అందుతున్న‌ట్టుగా తెలుస్తోంది. దీంతో అక్ర‌మాలు జ‌రుగుతూ ఉన్నాయి. కానీ ఆ అక్ర‌మాలు ఎక్కువ కాలం దాగ‌వు. బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. అలాంటి స‌మ‌యాల్లో అధికారుల స‌స్పెన్ష‌న్లు కూడా ఉంటాయి. అలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన అనేక మంది అధికారులు స‌స్పెండ్ అయ్యారు కూడా. కానీ అధికారుల తీరు మాత్రం మార‌డం లేదు. స‌స్పెన్ష‌న్ల‌కు భ‌య‌ప‌డ‌కుండా వారు అక్ర‌మాల‌ను కొన‌సాగిస్తూ ఉన్నారు. ల్యాండ్ డీల్స్ తో భారీ మొత్తాల‌ను సంపాదించుకునే అవ‌కాశం ఉండటంతో వారు అంత‌కు తెగిస్తూ ఉండ‌వ‌చ్చు.

అలాగే ఈ అక్ర‌మాల‌కు రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌లు కూడా ఉన్నాయ‌ని వినికిడి. ఇలాంటి అక్ర‌మాల్లో నేత‌ల‌కూ వాటాలున్నాయ‌ని.. గిద్ద‌లూరు ప్రాంతంలో మాజీ ప్ర‌జాప్ర‌తినిధి ఒక‌రు - ప్ర‌స్తుత ప్ర‌జాప్ర‌తినిధి మ‌రొక‌రు వీటికి వారు త‌మ ఆశీస్సుల‌ను అందిస్తున్నార‌ని టాక్. అందుకే అక్ర‌మాలు మ‌రింత ద‌ర్జాగా సాగుతున్నాయ‌ని స్థానికులు చెప్పుకుంటున్నారు.

అధికారుల నుంచి వాటాలు తీసుకుంటూ వారు అక్ర‌మాల‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని అనుకుంటున్నారు. 2014 వ‌ర‌కూ స్థానికంగా అధికారాన్ని క‌లిగి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధి ఈ అక్ర‌మాల‌కు వ‌త్తాసు ప‌లికాడ‌ని - ఆ త‌ర్వాత వ‌చ్చిన స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి కూడా అదే తీరును కొన‌సాగిస్తూ ఉన్నాడ‌ని స్థానికులు చెబుతున్నారు.