Begin typing your search above and press return to search.

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ని తొక్కాలని చూస్తున్నారా?

By:  Tupaki Desk   |   20 May 2021 3:30 AM GMT
వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ని తొక్కాలని చూస్తున్నారా?
X
రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న వ్య‌వ‌స్థ ఏదైనా ఉంటే.. అది అక్ష‌రాలా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌. ఆయ‌న అధికారంలోకి రాగానే తీసుకున్న తొలి ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌యం.. 4 ల‌క్ష‌ల మంది వలంటీర్ల‌ను నియ‌మించ‌డం. వీరిలో ప్ర‌స్తుతం 2.35 ల‌క్ష‌ల మంది లైవ్‌లో ఉన్నారు. నెల‌నెలా 5 వేల రూపాయ‌ల గౌర‌వ వేత‌నం కూడా ఇస్తున్నారు. వాస్త‌వానికి వీరు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు కాక‌పోయినా.. వారితో స‌మానంగా ప‌నులు చేస్తున్నారు. ఇంకోమాట‌లో చెప్పాలంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల క‌న్నా ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో నేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉన్న సంబంధాన్ని కూడా వీరు తెంపేశారు.

ప్ర‌జ‌ల‌కు ఏం కావాల‌న్నా.. వ‌లంటీర్లే చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఎలాంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌వేశ పెడుతున్నా.. ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నారు. అలాంటి వ్య‌వ‌స్థ ఏర్ప‌డినందున ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లకు మ‌ధ్య సేవ‌ల విష‌యంలో ఎలాంటి అంత‌రాయం లేకుండా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ వ్య‌వ‌స్థ ఏర్ప‌డి.. రెండేళ్లు అవుతున్న నేప‌థ్యంలో గ‌త ఆరు మాసాలుగా మాత్రం ఈ వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ స‌క్సెస్ అయింద‌ని.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఈ వ్య‌వ‌స్థ‌ను ఆద‌ర్శంగా తీసుకుని ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌, హ‌రియాణ వంటి రాష్ట్రాలు కూడా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. మ‌రి ఇంత ఆద‌ర్శంగా ఉన్న ఈ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నేత‌లే నిర్వీర్యం చేస్తున్నార‌న్న వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది వ‌చ్చిన క‌రోనా తొలి వేవ్‌లో వ‌లంటీర్లు ఎంతో కృషి చేశారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. ప‌రీక్ష‌లు చేయించ‌డం ద‌గ్గ‌ర నుంచి వైద్యం అందే వ‌ర‌కు కృషి చేశారు.

అయితే.. సెకండ్ వేవ్‌లో మాత్రం గ‌త రెండు నెల‌లుగా రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా.. వ‌లంటీర్లు ఎక్క‌డా ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే.. దీనివెనుక వైసీపీ నాయ‌కులే ఉన్నార‌ని.. ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే క‌ష్టాలు నేరుగా త‌మ‌తో చెప్పుకోవాలంటే.. ఇంత‌కు మించిన స‌మ‌యం లేద‌ని వారు భావిస్తున్నార‌ని.. అందుకే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తొక్కి పెడుతున్నార‌ని.. అంటున్నారు. ఇక వ‌లంటీర్లు కూడా వైసీపీ నాయ‌కులు చెప్పిన‌ట్టు చేస్తే పోలే.. ఈ గొడ‌వ‌లు మాకెందుకు అన్ని సైలెంట్ అవుతున్నారు. మ‌రి దీనిపై సీఎం జ‌గ‌న్ ఎలాంటి చర్య‌లు తీసుకుంటారో చూడాలి.