Begin typing your search above and press return to search.

ప్రాంతీయం... జాతీయంలో కీలకం

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:31 AM GMT
ప్రాంతీయం... జాతీయంలో కీలకం
X
ప్రాంతీయ పార్టీలు. ఒకప్పుడు ఆ రాష్ట్రాలకే పరిమితమైన పార్టీలు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు తమ ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతున్నాయి. ఎప్పుడో ఒకసారి - అడపా దడపా జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్నాయి. దీనికి కారణం ప్రాంతీయ పార్టీలలో ఉన్న అనైక్యతే. ప్రధానమంత్రి పదవితో పాటు ఇతర మంత్రి పదవులు - అధికార దాహంతో ప్రాంతీయ పార్టీల్లో విబేధాలు తారాస్ధాయికి చేరుకుని వారు విడిపోయేలా పరిస్ధితులు వస్తున్నాయి. ఇంతకు ముందు చాలా సార్లు ఇదే జరిగింది. ఇదే జరుగుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - వామపక్షాలు నానాటికీ బలహీనపడడం - భారతీయ జనతా పార్టీకి తన సొంత బలంపై నమ్మకం లేకపోవడంతో వారు కూడా ప్రాంతీయ పార్టీలను వాడుకుని అధికారంలో వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. జాతీయ స్ధాయిలో ప్రాంతీయ పార్టీల హవా మళ్లీ వీచే పరిస్తితులు వస్తున్నాయి. దీంతో జాతీయ పార్టీలు కూడా తమ పాత వైరాలనుె పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టే పరిస్థితి వచ్చింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఈసారి అధికారం ఏమంత సులభం కాదు. వారి పట్ల - ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో వారికి అధికారం దక్కే అవకాశాలు చాలా తక్కువని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజరోజుకు బలపడుతోంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా స్వంతంగా అధికారాన్ని చేపట్టే అవకాశాలు మాత్రం లేవని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశంలో ప్రాంతీయ పార్టీలదే ముందున్న రోజులని తేలుతోంది. దీనిని ద్రష్టిలో ఉంచుకున్న ప్రాంతీయ పార్టీలు ఒక్కటై మూడో కూటమికి తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రాల్లో ఉప్పు - నిప్పులా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో మాత్రం కలవాలనుకుంటున్నాయి. ఇది దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో భారతీయ జనత పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఎ కూటమికి 228 స్థానాలు వస్తాయని - యుపిఏ కూటమికి 224 స్ధానాలు వస్తాయని తేలింది. ఇక ఇతరులు అంటే ఏ కూటమిలోనూ లేని వారు - స్వతంత్రులు 91 స్ధానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని కూడా తాజా సర్వే చెబుతోంది. ఆ పరిణామాలలో ప్రాంతీయ పార్టీల పాత్ర జాతీయ స్ధాయిలో కీలకం కానుంది.