Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్యా.. ఏపీలో స్థానిక రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2021 9:34 AM GMT
హ‌మ్మ‌య్యా.. ఏపీలో స్థానిక రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా?
X
ఇప్పుడు కాదు.. దాదాపు ఏడాదిన్న‌ర కింద‌ట ఏపీలో స్థానిక సంగ్రామానికి తెర‌లేచింది. 2020 మార్చి నెల ఆరంభంలోనే ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ లు వ‌చ్చాయి. వాస్త‌వానికి అప్ప‌టికే రెండేళ్ల కింద‌ట ఏపీలో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గాల్సింది. కానీ అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఆ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేదు. పంచాయ‌తీ ప్రెసిడెంట్ లు కూడా మాజీ లు అయిపోయిన‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌ద‌వుల కోసం నేత‌లు ఎదురుచూస్తున్నా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వాటి నిర్వ‌హ‌ణ‌ను ప‌ట్టించుకోలేదు. మున్సిపాలిటీలు, పంచాయ‌తీలు ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లోనే కొన‌సాగాయి. అయితే జ‌గన్ వ‌చ్చాకా ఆరు నెల‌ల త‌ర్వాత స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు దుమ్ముదులిపారు. అనేక ఆటంకాలు మిగిలే ఉన్నా, కొన్ని మున్సిపాలిటీల్లో వివాదాల దృష్ట్యా వాటిని వదిలి.. మిగ‌తా వాటిల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రెడీ అయ్యాయి.

ఆ త‌ర్వాతే క‌థ‌లో మ‌లుపులు మొద‌ల‌య్యాయి. నామినేష‌న్ల ఘ‌ట్టం దాదాపు పూర్త‌యిన ద‌శ‌లో ఇక పోలింగ్ త‌రువాయి అనుకున్న ద‌శ‌లో అప్ప‌టి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎన్నిక‌ల వాయిదా ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో వాయిదా అని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఒక‌వేళ ప్ర‌భుత్వ స‌మ్మ‌తితో ఆ ప్ర‌క‌ట‌న చేసి ఉంటే.. వివాదం అయ్యేది కాదు. అయితే నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ మాత్రం ఏపీ ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇవ్వ‌కుండానే ఆ ప్ర‌క‌ట‌న చేశారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆదేశాల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే కోర్టును ఆశ్ర‌యించింది.

అయితే కోర్టులో వివాదం కొన‌సాగింది. వెంట‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిమ్మ‌గ‌డ్డ‌పై క‌న్నెర్ర చేసింది. ఏపీ ఎస్ఈసీ నియామ‌కానికి సంబంధించి మార్పులు చేసింది. నిమ్మ‌గ‌డ్డ‌ను సాగ‌నంపే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ప్ర‌భుత్వం చేసిన మార్పుల‌కు కోర్టు సానుకూలంగా స్పందించ‌లేదు. దీంతో వివాదం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. నిమ్మ‌గ‌డ్డే తిరిగి ఎస్ఈసీగా కొన‌సాగుతార‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు వేగంగా ముందుకు వెళ్లారు. అప్పుడు ప్ర‌భుత్వం అభ్యంత‌రం చెప్పింది. అయితే ఈ సారి కూడా ప్ర‌భుత్వ వాద‌న‌కు కోర్టులో సానుకూల స్పంద‌న రాలేదు. చివ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ పంతం మేర‌కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ జ‌రిగింది. ముందుగా పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిల్లో టీడీపీ చిత్తు అయ్యింది. మ‌రి అదే ఊపులో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సిన నిమ్మ‌గ‌డ్డ ఎందుకో వెన‌క్కు త‌గ్గారు! దీంతో ప్ర‌భుత్వానికి కోపం వ‌చ్చింది.

అయితే అంత‌లోనే నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీకాలం ముగియ‌డంతో మ‌రో ఎస్ఈసీ వ‌చ్చి వెంట‌నే ఎన్నిక‌ల‌కు ప్ర‌క‌ట‌న చేశారు. అయినా వ్య‌వ‌హారం అయిపోలేదు. మ‌ళ్లీ టీడీపీ కోర్టుకు వెళ్లింది. ఎన్నిక‌లు వ‌ద్దంది. అయితే ఎస్ఈసీ ఏర్పాట్ల‌ను చేశారు. పోలింగ్ ముందు రోజు వ‌ర‌కూ ర‌చ్చ జ‌రిగింది. చివ‌ర‌కు కోర్టు ఆదేశాల మేర‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయినా మ‌ళ్లీ కోర్టులో పిటిష‌న్లు! ఎన్నిక‌లు ర‌ద్దు అయిన‌ట్టుగా సింగిల్ బెంచ్ జ‌డ్జి తీర్పు, ఆ త‌ర్వాత ప్ర‌తిష్టంభ‌న‌, చివ‌ర‌కు ధ‌ర్మాస‌నం గ్రీన్ సిగ్న‌ల్!

పోలింగ్ పూర్త‌యిన ఐదు నెల‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కూ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. గ‌త ఏడాది మార్చిలో మొద‌లైన ఈ స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారం.. ఎట్ట‌కేల‌కూ ఇప్ప‌టికి ముగిసింది. ఒక‌వేళ ఫ‌లితాల వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ అంశంపై ఏ సుప్రీం కోర్టునో ఆశ్ర‌యిస్తే.. మ‌ళ్లీ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంటుందో, లేక ఇంత‌టితో ఈ క‌థ ఒక కొలిక్కి వ‌స్తుందో!