Begin typing your search above and press return to search.

'మ‌హా' సెంటిమెంట్ ఎవ‌రికి ప‌ట్టం క‌డుతుందో..!

By:  Tupaki Desk   |   25 Sep 2019 8:23 AM GMT
మ‌హా సెంటిమెంట్ ఎవ‌రికి ప‌ట్టం క‌డుతుందో..!
X
మహారాష్ట్ర ఎన్నికలకు కౌంట్‌ డౌన్ మొద‌లైంది. వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల కోసం అన్ని పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో రెండోసారి విజ‌యం సాధించేందుకు అధికార బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఇందుకోసం స‌రికొత్త ఫార్ములాను తెర‌పైకి తెచ్చేందుకు ప్ర య‌త్నిస్తోంది. సెంటి మెంట్ రంగరించి - ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను కొల్ల‌గొట్టే స్ట్రాట‌జీని అమ‌లు చేసేందుకు క‌మ‌ల‌నాథులు రెడీ అయ్యారు.

భారతీయ జనతా పార్టీ ప్ర‌ధానంగా హిందూ ఓటు బ్యాంకు పైనే ఆధారపడి ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలు దగ్గరపడే సమయంలో ప్రజలకు హామీలతో పాటు కొన్ని సెంటిమెంట్లను కూడా రాజేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇందులో భాగమే. అత్యధికశాతం మరాఠాలున్న ఆ ప్రాంతంలో రిజర్వేషన్ల ప్రభావం తమకు ఎన్నికల్లో ఎంతగానో క‌లిసివ‌స్తుంద‌ని ఆపార్టీ అంచనా వ‌స్తోంది.

ఇక హిందుత్వ పునాదుల‌పైనే ఉద్భవించిన పార్టీ శివసేన.. మ‌హారాష్ట్ర‌లో బ‌ల‌మైన పార్టీ గా ఉన్న శివ‌సేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సైతం లోకల్ నినాదాలతోనే రాజ‌కీయాల్లో ఎదిగారు. అయితే తండ్రి బాటలోనే ప్రస్తుతం ఆయ‌న త‌న‌యుడు ఉద్ధవ్ థాక్రే నడుస్తున్నారు. హిందుత్వంతో పాటు లోకల్ నినాదంతో ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు. మరాఠేతరులను ముంబయి నుంచి పంపాలన్న డిమాండ్‌తో గ‌తంలో శివసేన ఉద్య‌మించింది. ఇప్పుడు అదే అంశంతో ఓట్లు కొల్ల‌గొట్టేందుకు సిద్ధ‌మైంది. సంకీర్ణ భాగస్వామ్యంలో ఉన్నా మహారాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే శివసేన బీజేపీపైనా శివాలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

కాగా శివసేన నుంచి బయటకు వచ్చిన మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సంస్థ అధినేత‌ రాజ్ థాక్రే కూడా సెంటిమెంట్ నే న‌మ్ముకున్నాడు. గతంలో ఆయన కూడా మరాఠాల ఉద్యమాన్ని నడిపారు. అయితే పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచినప్ప‌టికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సత్తా చాట లేకపోయారు. ఇక తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న నేప‌థ్యంలో రాజ్ థాక్రే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. మరాఠీ మాట్లాడే వారికే ఇళ్లు విక్రయించాలని - మరాఠాలకే ఇల్లు అద్దెకు ఇవ్వాలన్న నినాదాన్ని తెర‌పైకి తెచ్చారు. మొత్తంగా బీజేపీతోపాటు శివ‌సేన‌ - ఎంఎన్ ఎస్‌ లు మ‌రాఠా ప్ర‌జ‌ల‌ల్లో సెంటిమెంట్ ర‌గిలించి - త‌ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందేలా ప్ర‌య‌త్నిస్తుండ‌టం గ‌మ‌నార్హం.