Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : మహారాష్ట్రలో నాందేడ్ తో పాటుగా ఆ 2 జిల్లాల్లో లాక్ డౌన్!

By:  Tupaki Desk   |   24 March 2021 1:00 PM GMT
కరోనా ఎఫెక్ట్ : మహారాష్ట్రలో నాందేడ్ తో పాటుగా ఆ 2 జిల్లాల్లో లాక్ డౌన్!
X
దేశంలో కరోనా విలయం మరోసారి రోజురోజుకి ఉధృతంగా మారుతుంది. ఇక దేశంలో కరోనా అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్రే. కరోనా కేసులు, మరణాల విషయంలో మిగతా రాష్ట్రాలకు అందనంత ఎత్తులో ఉన్న మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి మరింతగా బుసలు కొడుతోంది. అక్కడ రోజు మళ్లీ వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. తాజాగా నాందేడ్ జిల్లాలో లాక్‌ డౌన్ విధించింది. నాందేడ్ జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు లాక్‌ డౌన్ అమల్లో ఉంటుందని అక్కడి అధికారులు బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 4 వరకు లాక్‌ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే బీడ్ జిల్లాలోనూ పది రోజుల పాటు లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ చూపెట్టాలని అధికారులు నిర్దేశిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఈ తరహా ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్న జిల్లాలను అప్రమత్తం చేసింది.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గ‌త‌ 24 గంట‌ల్లో 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 23,907 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,34,058కు చేరింది. గత 24 గంటల్లో 24 గంట‌ల సమయంలో 275 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,441కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,05,160 మంది కోలుకున్నారు.