Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ కు.. లాక్ డౌనే మంద‌ట‌!

By:  Tupaki Desk   |   1 May 2021 11:46 AM GMT
సెకండ్ వేవ్ కు.. లాక్ డౌనే మంద‌ట‌!
X
ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోందే తప్ప.. తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 4 లక్షల మార్కును దాటేశాయి. దీంతో.. మ‌హ‌మ్మారి దేశాన్ని ఏవైపున‌కు తీసుకెళ్తుందో అన్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో.. అమెరికా వైట్ హౌస్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ.. భార‌త్ లో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించ‌డం ద్వారానే కొవిడ్ చైన్ ను తెంచ‌గ‌ల‌మ‌ని అభిప్రాయప‌డ్డార‌ట‌.

‘ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్’తో మాట్లాడిన ఆయన.. ఈ మేర‌కు సూచించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ వేవ్ ను అడ్డుకోవాలంటే.. లింకును తెంచ‌డ‌మే మార్గ‌మ‌ని, దానికి తాత్కాలిక లాక్ డౌన్ విధించ‌డ‌మే స‌రైన‌ద‌ని అన్న‌ట్టు స‌మాచారం.

భార‌త్ ఈ ప‌రిస్థితుల్లో ఉండ‌డం చాలా బాధ‌గా ఉంద‌న్న ఫౌసీ.. ప్ర‌పంచ మొత్తం స‌హాయం చేయాల‌ని అన్నార‌ట‌. ఈ ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ విధించ‌డంతోపాటు.. ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ చాలా ముఖ్య‌మ‌ని అన్న‌ట్టుగా తెలుస్తోంది. దేశంలో చాలా త‌క్కువ మందికి టీకాలు వేయ‌డం తీవ్ర‌త‌కు కార‌ణ‌మైంద‌న్న ఫౌసీ.. వ్యాక్సినేష‌న్ వేగంగా పెంచాల్సిన అవ‌స‌రాన్ని నొక్కిచెప్పార‌ట‌.

కాగా.. దేశంలో టీకా కార్య‌క్ర‌మం మంద‌కొడిగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్ కొర‌త వేధిస్తుండ‌డంతో.. చాలా రాష్ట్రాల్లో టీకా కార్య‌క్ర‌మం వాయిదా ప‌డుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్ అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టి.. జనవరి 16 నుంచి టీకాలు వేస్తున్నారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 15.5 కోట్ల మందికి మాత్ర‌మే టీకాలు వేసిన‌ట్టు స‌మాచారం.

ఇటు కేసుల సంఖ్య చూస్తుంటే.. రోజురోజుకూ వ‌ర‌ద ప్ర‌వాహంలా పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. మ‌ర‌ణాల సంఖ్య కూడా అంత‌కంత‌కూ పెరుగుతూ పోతుండడం మ‌రింత‌ ఆందోళ‌న క‌లిగించే అంశం. గ‌డిచిన 24 గంట‌ల్లో.. 4 ల‌క్ష‌ల 1 వెయ్యి 999 మంది కొత్త కేసులు న‌మోదు కాగా.. 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌రిస్థితి మున్ముందు ఇంకా ఎలాంటి ప‌రిస్థితికి దారితీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.