Begin typing your search above and press return to search.

మోడీ ట్విస్టు.. ప్యాకేజీ ప్రకటన ఒక రోజు.. డిటైల్స్ దశలవారీనా?

By:  Tupaki Desk   |   13 May 2020 5:45 AM GMT
మోడీ ట్విస్టు.. ప్యాకేజీ ప్రకటన ఒక రోజు.. డిటైల్స్ దశలవారీనా?
X
మిగిలిన వారి లెక్కలకు భిన్నంగా ఉంటాయి ప్రధాని మోడీ వ్యూహాలు. అంచనాలకు అందని రీతిలో ఆయన ఎత్తులు ఉంటాయన్నది అందరికి తెలిసిందే. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ నర్మగర్భంగా ఇచ్చే సందేశం ఏదో ఒకటి ఉంటుంది. అందుకు నిదర్శనంగా తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన భారీ ప్యాకేజీ ప్రకటనే. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏదైనా తీపికబురు ప్రకటించే సమయంలోనే.. దానికి సంబంధించిన వివరాల్ని చెప్పేస్తారు. అందుకు భిన్నంగా.. తీపికబురు ఇవాళ.. వాటి వివరాలు రేపటి నుంచి చెబుతూ ఉంటారన్న మాట ఎక్కడైనా విన్నారా?

అలాంటి సిత్రవిచిత్రమైన తీరు మోడీలో మాత్రమే కనిపిస్తుంటుంది. దేశ ప్రధాని హోదాలో ఏదైనా ప్రకటన చేయటానికి ముందు.. చాలానే కసరత్తు జరుగుతుంటుంది. ఎంతో తర్జనభర్జన తర్వాతనే అధికారిక ప్రకటన వెలువడుతుంది. అలాంటప్పుడు రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందన్న విషయాన్ని ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించిన నోటితోనే.. అందులో ఏమేం అంశాలు ఉంటాయన్న వివరాల్ని ఆయన ఎందుకు ప్రకటించలేదు? అన్నది ప్రశ్న.

భారీ ప్యాకేజీ అన్న మాటతో.. రానున్న రోజుల్లో ఎవరేం చేసినా.. అదంతా మోడీ పుణ్యమేనన్న భావన తన తాజా ప్రకటనతో స్పష్టం చేశారని చెప్పాలి. అదే సమయంలో.. తాను ప్రకటన చేసిన రోజునే.. వివరాల్ని వెల్లడిస్తే.. ఆ మొత్తం రూ.20లక్షల కోట్లకు దగ్గరగా ఉందా? లేదన్న విషయాన్ని తేల్చేస్తారు విశ్లేషకులు. అలాంటి అవకాశం లేకుండా.. ముక్కలు ముక్కలుగా ప్యాకేజీ వివరాల్ని ప్రకటించటం ద్వారా.. అసలెంత ప్యాకేజీ అన్నది అర్థం కానట్లుగా చేయటమే మోడీ ప్రభుత్వ ఉద్దేశమా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

తాను ప్రకటించే ప్రతి ప్యాకేజీకి.. ప్రకటనకు అందమైన పేరు పెట్టే మోడీ మాటలకు వాస్తవానికి మధ్య పొంత ఉండదన్న విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది కూడా. ఎక్కడి దాకానో ఎందుకు.. వలసల్ని వారి సొంతూళ్లకు చేర్చేందుకు వీలుగా పట్టాలెక్కించిన శ్రామిక్ రైళ్ల సంగతి చూసినప్పుడు విషయం ఇట్టే అర్థమవుతుంది. శ్రామిక్ రైళ్ల పేరుతో నడిపే సర్వీసులకు సైతం సర్ ఛార్జి విధించిన ఘనత మోడీ సర్కారుదే.

అలాంటిది రూ.20లక్షల కోట్ల పేరుతో ప్రకటించిన ప్యాకేజీలో మరెన్ని మతలబులు ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాను ప్రకటించిన తాజా ప్యాకేజీకి ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఘనమైన పేరు పెట్టుకున్న మోడీ.. సినిమాటిక్ గా ఇచ్చిన ట్విస్టు అదిరి పోయిందనే చెప్పాలి.