Begin typing your search above and press return to search.

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు ఖాయమట.. తేలాల్సింది వారమా? 10 రోజులా?

By:  Tupaki Desk   |   30 May 2021 3:37 AM GMT
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు ఖాయమట.. తేలాల్సింది వారమా? 10 రోజులా?
X
అంతకంతకూ చెలరేగిపోతున్న మహమ్మారికి కళ్లాలు వేయటం కోసం తెలంగాణలో తీసుకొచ్చిన లాక్ డౌన్ గడువు ఈ రోజుతో ముగియనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని సేవలు లభించేలా.. ఆ తర్వాత నుంచి పూర్తిగా మూసివేసేలా అమలు చేసిన లాక్ డౌన్ సత్పలితాలు ఇచ్చినట్లుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ విధించటానికి ముందున్న పరిస్థితికి ఇప్పటికి ఏ మాత్రం సంబంధం లేదని.. వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటమే కాదు.. కేసుల నమోదులోనూ చాలా తేడా వచ్చిన వైనం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో లాక్ డౌన్ ను పొడిగించే అంశాన్ని ప్రత్యేకంగా చర్చిస్తారని చెబుతున్నారు. సోమవారం నుంచి లాక్ డౌన్ ను ఎలా అమలు చేయాలన్న అంశంపై అందరి అభిప్రాయాన్ని తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి రోజుకు 3వేల కేసులు నమోదు కావటం.. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోవటం తెలిసిందే.

గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి బాగానే ఉన్నా.. కేసుల సంఖ్య తగ్గాలంటే మరింతకాలం లాక్ డౌన్ పొడిగించాన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లాక్ డౌన్ పొడిగింపు ఖాయమని చెబుతున్నారు. కాకుంటే.. అది వారమా? పది రోజులా? అన్నది తేలాల్సి ఉందని చెబుతున్నారు. వారం మరింత తక్కువ సమయం అవుతుందని..అలా అని 15 రోజులు ఎక్కువ గడువుగా మారుతుందని.. అందుకే మధ్యే మార్గంగా మరో పది రోజుల పొడిగింపును ప్రభుత్వం తీసుకునే వీలుందని చెబుతున్నారు.

కాకుంటే.. ఈసారి కొన్ని మినహాయింపులకు అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు అమలు చేస్తున్న ఉదయం 6 - 10 సమయాన్ని కాస్త పెంచే అవకాశం ఉందంటున్నారు. మరో రెండు గంటలు అదనంగా సమయాన్నిఇవ్వటం ద్వారా..వ్యాపార వర్గాలు ఊపిరి పీల్చుకుంటాయని.. ప్రభుత్వానికి పన్ను ఆదాయం వస్తుందన్న ఆశాభావంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. రెండు గంటల సమయం పెరగటం వల్ల కేసుల నమోదు పెరుగుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ కు కాస్త రిలాక్స్ ఇచ్చేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.