Begin typing your search above and press return to search.

నిదాన‌మే రాష్ట్రాల‌ విధానంః స‌డ‌లింపు.. పొడిగింపు

By:  Tupaki Desk   |   6 Jun 2021 12:30 AM GMT
నిదాన‌మే రాష్ట్రాల‌ విధానంః  స‌డ‌లింపు.. పొడిగింపు
X
నిజం చెప్పాలంటే.. తొలి ద‌శలో లాక్ డౌన్ విధించిన‌ప్పుడు దేశ‌, రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఈ స్థాయిలో భారం ప‌డుతుంద‌ని బ‌హుశా ప్ర‌భుత్వాలు కూడా ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. లాక్ డౌన్ మొద‌లైన కొన్నాళ్ల‌ త‌ర్వాత‌గానీ ప‌రిస్థితి తీవ్ర‌త అర్థం కాలేదు. వ్ర‌తం చెడ్డా ఫ‌లం ద‌క్కాల‌న్న చందాన.. ఇబ్బందులు ఎదురైనా లాక్ డౌన్ కొన‌సాగించారు. మొత్తానికి తొలి ద‌శ‌లో క‌రోనాను చాలా వ‌ర‌కు క‌ట్టడి చేశారు. కానీ.. మూడు నెల‌లు కూడా ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డ‌కుండానే.. సెకండ్ వేవ్ దూసుకొచ్చింది. ప‌రిస్థితి తీవ్ర‌త శ‌ర‌వేగంగా ఎక్కువై.. ఆందోళ‌న‌క‌రంగా మారిపోయిన‌ప్ప‌టికీ.. లాక్ డౌన్ మాట ఎత్త‌లేక‌పోయింది కేంద్రం.

రాష్ట్రాల‌కే నిర్ణ‌యం వ‌దిలిపెట్ట‌డంతో.. చాలా రాష్ట్రాలు త‌మ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ఇంకా తీసుకుంటున్నాయి. అయితే.. తొలి ద‌శ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొని వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితిలో ఉన్నాయి ప్ర‌భుత్వాలు. ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ విధించిన‌ప్ప‌టికీ.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూడా స‌రిచూసుకోవాల్సిన ప‌రిస్థితి. కొవిడ్ వ్యాప్తి నిరోధం పేరుతో లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తే.. ఖ‌జానాకు తీవ్ర న‌ష్టం వాటిల్లే ప‌రిస్థితి నెల‌కొంది. అందుకే.. స‌డ‌లింపు, పొడిగింపు ప‌ద్ధ‌తిని ఎంచుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ముందుగా విధించిన నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ.. రిలాక్సేష‌న్ స‌మ‌యాన్ని ప్ర‌భుత్వాలు పెంచాయి. దీనివ‌ల్ల వ్యాపార కార్య‌క‌లాపాల‌కు మ‌రికాస్త స‌మ‌యం దొరికిన‌ట్టైంది. అదే స‌మ‌యంలో లాక్ డౌన్ కాలాన్ని జూన్ 10 వ‌ర‌కు పొడిగించాయి.

ఢిల్లీలో చాలా కాలం క‌ఠిన లాక్ డౌన్ అమ‌లు చేసిన ప్ర‌భుత్వం.. స‌డ‌లింపు ప్ర‌క్రియ మొద‌లు పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఒక రోజున‌.. మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌రొక రోజున దుకాణాలు తెరుచుకోవాల‌ని ఆదేశించింది. అదే స‌మ‌యంలో లాక్ డౌన్ అమ‌లును జూన్ 14 వ‌ర‌కు పొడిగిస్తూ మ‌రోసారి నిర్ణ‌యం తీసుకుంది.

ద‌క్షిణాదిన క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోదైన రాష్ట్రం త‌మిళ‌నాడు. ప‌రిస్థితి తీవ్రంగా ఉండ‌డంతో ఇన్నాళ్లు క‌ఠిన లాక్ డౌన్ అమ‌లు చేసింది ప్ర‌భుత్వం. తాజాగా.. 27 జిల్లాల్లో నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించింది. మిగిలిన జిల్లాల్లో మాత్రం క‌ఠిన నిబంధ‌న‌లు కొన‌సాగిస్తోంది. ఇక ఈ రాష్ట్రంలోనూ జూన్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఇక్క‌డ మే 2 నుంచి లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అటు ఈశాన్య రాష్ట్రం మేఘాల‌య‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. అక్క‌డ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు దుకాణాల‌ను తెరుచుకునేందుకు స‌ర్కారు అనుమ‌తించింది. లాక్ డౌన్ ను జూన్‌ 14 వ‌ర‌కు పొడించింది. ఈ విధంగా ప్ర‌భుత్వాలు ఇటు ప్ర‌జారోగ్యాన్ని కాపాడుకునేందుకు లాక్ డౌన్ కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సైతం గాడిలో పెట్టేందుకు స‌డ‌లింపు, పొడిగింపు విధానాన్ని ఎంచుకున్నాయి.