Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ అంటే చులకనా..బాధ్యతుండక్కర్లా?

By:  Tupaki Desk   |   23 March 2020 2:30 PM GMT
లాక్ డౌన్ అంటే చులకనా..బాధ్యతుండక్కర్లా?
X
కరోనా దెబ్బకు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఏపీతోపాటు తెలంగాణలోనూ మార్చి 31వరకు లాక్ డౌన్ విధించాలని సీఎం జగన్, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ప్రకారం దేశవ్యాప్తంగా మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు....9 దాటగానే రోడ్లపై గుంపులు గుంపులుగా ప్రత్యక్షమయ్యారు. జనతా కర్ఫ్యూను మార్చి 31 వరకు కంటిన్యూ చేయాలని, అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహాయించి మిగతావన్ని బంద్ చేయాలని.... రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన పిలుపును కొన్ని రాష్ట్రాల ప్రజలు పెడచెవిన పెట్టారు. లాక్ డౌన్ ను విస్మరించిన కొందరు బైక్ లపై రోడ్ల మీద షికార్లు చేస్తుండడంతో వారి బైక్ అను రంగారెడ్డి పోలీసులు సాయంత్రం వరకు సీజ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు పూర్తి స్థాయిలో పాటించడం లేదని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సమాజం కోసమే పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కేసులు, అవసరమైతే క్రిమినల్ కేసులు ఎదురుకోవాల్సి ఉంటుందని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. కరోనాను కట్టడి చేసేందుకు కొన్ని కఠిన నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి. వీటి వల్ల ప్రజల దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. కేంద్రం విధించిన నిబంధనలు కూడా ప్రజల క్షేమం కోరే కదా. కరోనా పాజిటివ్ వచ్చిన కొందరు చేసే తప్పు వల్ల ఆ వైరస్ మిగతా వారికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకే కదా కేంద్రం ఇటువంటి చర్యలు చేపట్టింది. కానీ, కొందరు ప్రజలు ఆ రూల్స్ మనకు వర్తించవులే అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. అత్యవసర పని లేకున్నా....బైక్ ల మీద వీధుల్లో, రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించబోమని....హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డిలో బైక్ ల మీద అకారణంగా తిరుగుతున్న కొందరి బైక్ లను సీజ్ చేశారు. ఈరకంగా నిబంధనలు ఎందుకు విధించామో జనం అర్థం చేసుకోవాలని, అంతేకానీ కొందరికి ఇచ్చిన సడలింపును దుర్వినియోగపరుచుకోకూడదని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే పోలీస్ పవర్ చూపుతామని చెప్పారు.

మనదేశం మరో ఇటలీ కాకూడదన్న ఉద్దేశంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పది రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించాయి. కానీ, కొందరు ప్రజలు ఏ మాత్రం బాధ్యత లేకుండా...ప్రవర్తించడం శోచనీయం. ఈ తరహా కఠిన నిబంధనలు ఎందుకు విధించారో ప్రజలు అర్థం చేసుకోవాలి. మనల్ని ఇళ్లలోనే ఉంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి , రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమన్నా ఉపయోగం ఉందా అని జనం ఆలోచించాలి. మన శ్రేయస్సు కోరి జాగ్రత్తగా ఉండమని సూచించినా వినకపోతే ఎలా. రెక్కాడితే గాన డొక్కాడని , దినసరి కూలీలు, రోజువార వేతన జీవుల పరిస్థితి కొంత ఇబ్బందికరమే. వాటికి ప్రత్యామ్నాయంగా రేషన్ సరఫరా, నగదు పంపిణీ వంటివి ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కాబట్టి, కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలి...ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలి. కొందరి బాధ్యతా రాహిత్యం...ఎందరికో ప్రాణ సంకటంగా మారుతందన్న విషయం ప్రజలు గుర్తుంచుకొని బాధ్యతగా ప్రవర్తించడం మంచిది.