Begin typing your search above and press return to search.

ఆ జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్.. మ‌న తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు కూడా!

By:  Tupaki Desk   |   11 Dec 2021 11:30 PM GMT
ఆ జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్.. మ‌న తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు కూడా!
X
దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ఐదు రాష్ట్రాల్లోని ప‌లు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించేలా..కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వీటిలో తెలంగాణ‌, ఏపీల్లోని కొన్ని జిల్లాలు కూడా ఉండ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దేశంలో కొవిడ్-19, ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. వైరస్ వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, జిల్లాల వారీగా దృష్టిసారించాలని కేంద్రం ఆరోగ్య శాఖ .. రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది.

మిజోరాం, కేరళ, సిక్కిం, తెలంగాణ‌, ఏపీల్లోని 12 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉందన్నారు. కేరళ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మణిపుర్, బెంగాల్, నాగాలాండ్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10 శాతం ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ 27 జిల్లాల్లో కరోనా వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. అవ‌స‌ర‌మైతే.. పాక్షిక లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను కూడా అమ‌లు చేయాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం.

దేశంలోని ఏదైనా జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువ లేదా 60 శాతం కంటే ఎక్కువ పడకలు నిండిపోవడం జరిగితే.. ఆ జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించాలి. వైరస్ కట్టడి చర్యలను చేపట్టాలి. రాత్రి కర్ఫ్యూలు, జనసమూహాలను తగ్గించడం, రాజకీయ, సామాజిక, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిషేధించడం, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జన సమూహాన్ని తగ్గించడం.. లాంటి చర్యలను చేపట్టాలి అని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో కేంద్రం స్ప‌ష్టం చేసింది.

కేంద్రం జారీచేసే వైరస్ కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలని పేర్కొంది. రాష్ట్ర స్థాయిలో కొవిడ్ నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించి మార్గదర్శకాలను జారీ చేయాలని.. ఈ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలో స్ప‌ష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది.