Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ మరింత పెరుగుతుందా?

By:  Tupaki Desk   |   27 March 2020 1:30 AM GMT
లాక్ డౌన్ మరింత పెరుగుతుందా?
X
సుత్తి లేకుండా.. సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. ప్రధాని మోడీ ప్రకటించిన ఇరవైఒక్క రోజుల లాక్ డౌన్ ఎప్పటికి ముగుస్తుంది? అన్న ప్రశ్న వేసినోళ్లను.. జాలిగా చూస్తే.. ఆ మాత్రం తెలీదా? అన్నట్లు బిల్డప్ ఇచ్చి ఏప్రిల్ 15 అన్న మాట పలువురి నోట వస్తోంది. అయితే.. అడిగే వారి ప్రశ్నలో క్లారిటీ ఉన్నా.. సమాధానం చెప్పే వారిలో మిస్ కావటం అసలు సమస్య.

ఎందుకంటే.. లాక్ డౌన్ 21 రోజులని ప్రధానమంత్రి చెప్పినా.. అదే ఫైనల్ అని అనుకోలేం. చైనాలోని పూహాన్ మహానగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. అసలు సంగతి ఇట్టే అర్థమైపోతుంది. వైరస్ వ్యాప్తిని ఎంత మొదట్లో నిలిపివేస్తే.. అంత త్వరగా లాక్ డౌన్ ను ఎత్తి వేసే వీలుంది. అలా కాకుండా.. ఒక ఫ్రాన్స్.. ఒక స్పెయిన్... మరో ఇరాన్.. ఇంకో అమెరికాలా మారితే.. మన దగ్గర ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపటం కీలకం. అదెంత త్వరగా జరిగితే.. అంత వేగంగా లాక్ డౌన్ ముగిసే వీలుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో.. 130 కోట్ల మంది జానాభా ఉన్న చోట.. వైరస్ వ్యాప్తి చాలా త్వరగా జరుగుతుంది. అయితే.. మన ఆహారపు అలవాట్లు కొంతమేర మనల్ని రక్షించే వీలుంది. అయితే.. అవగాహన లేమి.. అవసరం లేని భరోసా.. సొంత ప్రయోజనాలు తప్పించి సమాజం పట్ల అవగాహన తక్కువగా ఉండే వారి కారణంగా వైరస్ మరింత వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ మహమ్మారిని అధిగమించటం కష్టమైతే కాదు.

ప్రధాని మోడీ నోటి నుంచి లాక్ డౌన్ మాట వచ్చినంతనే రెండు విరుద్దమైన వాదనలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. ఇప్పటికే ఆలస్యమైంది.. మరింత ముందే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందని. రెండోది.. 21 రోజులు ఎందుకు? పది రోజులు సరిపోతుంది కదా అని? డ్రాయింగ్ రూంలో కూర్చొని నిర్ణయాలు చెప్పేకన్నా.. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించకుండా ప్రజలేం చేయాలన్న ఆదేశాలు జారీ చేయరన్నది మర్చిపోకూడదు.

ఇక.. మొదటి వాదనకు వస్తే.. జరిగిన దాని గురించి పోస్ట్ మార్టం చేసే కన్నా.. జరిగే దాని మీద మరింత ఫోకస్ పెట్టి.. వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటే బెటర్. కరోనా కారణంగా బాగా ఎపెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే..21 రోజుల తర్వాత మహా అయితే మరో పది రోజుల పొడిగించి.. లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం ఉంది. అలా కాకుండా.. వ్యాప్తి వేగంగా సాగితే మాత్రం.. రానున్న రోజుల్లో మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తి వేస్తారన్న ఆలోచన కంటే కూడా.. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని నూటికి నూరుశాతం పాటిస్తున్నానా? లేదా? అన్న విషయం మీద ఫోకస్ పెడితే మంచిదని చెప్పక తప్పదు.