Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ సక్సెస్‌..కరోనాను కట్టడి చేశారు

By:  Tupaki Desk   |   5 April 2020 10:57 AM GMT
లాక్‌ డౌన్‌ సక్సెస్‌..కరోనాను కట్టడి చేశారు
X
ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. ఆ వైరస్‌ ప్రభావంతో అగ్రరాజ్యం గజగజగ వణుకుతోంది. అయితే ఆ దేశంలో మొట్టమొదటి కరోనా కేసు వాషింగ్టన్‌ రాష్ట్రంలో బయట పడింది. మొదట తీవ్రంగా ప్రభావితమైన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకుంటోంది. గతంలో అత్యధిక కేసులతో కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్రం పక్కాగా తీసుకున్న నివారణ చర్యలతో ఇప్పుడు ఆ రాష్ట్రం కరోనా కేసుల్లో వెనకబడిపోయింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికంతటికీ కారణం.. కట్టుదిట్టమైన లాక్‌ డౌన్‌ అమలేనని తెలుస్తోంది. కఠిన నిబంధనలు తీసుకోవడం.. పటష్టంగా లాక్‌ డౌన్‌ అమలు చేయడంతో ప్రస్తుతం కేసుల్లో మొదటి స్థానం ఉన్న వాషింగ్టన్‌ ఇప్పుడు పదో స్థానానికి పడిపోవడం గమనార్హం.

మార్చి మూడో వారంలో 3,250 కేసులతో అమెరికాలోనే మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్‌ రాష్ట్రం ఇప్పుడు 6,966 కేసులకు చేరుకుంది. అయితే ఇది అమెరికాలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని న్యూయార్క్ - న్యూజెర్సీలు భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వాషింగ్టన్‌ ప్రభుత్వానికి - పోలీసులకు అక్కడి ప్రజలు సంపూర్ణంగా సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

కరోనా కేసుల వ్యాప్తి నమోదు కాగానే వెంటనే వాషింగ్టన్ - కాలిఫోర్నియా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. మార్చి మొదటి వారంలో లాక్‌ డౌన్‌ ప్రకటించగా వాషింగ్టన్‌ లో 76 లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సంస్థలు గూగుల్ - మైక్రోసాఫ్ట్ - యాపిల్ - అమెజాన్ - ఫేస్‌ బుక్‌ సహా వందల కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ సౌకర్యం కల్పించడంతో ఉద్యోగులు గడప దాటలేదు. ఇక లాక్‌ డౌన్‌ ను పకడ్బందీగా అమలు చేశారు. పని లేకుండా రోడ్లపైకి వచ్చిన ప్రజలకు పోలీసులు భారీగా జరిమానా వేశారు. నిత్యావసర సరుకుల స్టోర్స్‌కు కూడా గంటకు 10-15 మంది ప్రజలు వస్తుండగా.. ఆ వచ్చిన వారు 5 మీటర్లు భౌతిక దూరం పాటించారు. ప్రతి ఇంటికి ఒకరిద్దరు కాకుండా ఒక కమ్యూనిటీలో ఉండేవారు 4-5 కుటుంబాలకు అవసరమైన వస్తువుల కోసం ఒక్కరే వెళ్లేలా నిబంధనలు రూపొందించారు. వాటిని ప్రజలు విధిగా పాటించారు.

ఈ విధంగా పక్కాగా చర్యలు తీసుకోవడంతో ఆ దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులో ఉంది. కొత్త కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరికొన్నాళ్లు ఇదే విధంగా లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని వాషింగ్టన్‌ లోని అధికారులు చెబుతున్నారు. మరికొన్నాళ్లు ఇదే విధంగా ప్రజలు సహకరిస్తేనే త్వరలోనే కరోనాను పూర్తిగా వెళ్లగొట్టి కరోనా రహిత వాషింగ్టన్‌ అవతరిస్తుందని అక్కడి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రం మాదిరి కాలిఫోర్నియా కూడా పక్కాగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని గణాంకాలు చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలు అమెరికాలోని ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ కళ్లు తెరిపిస్తున్నాయి.

న్యూయార్క్‌ లో 1,03,476
న్యూజెర్సీలో 29,895 కేసులు
కాలిఫోర్నియా 12,581
వాషింగ్టన్‌ 6,966