Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: లాక్ డౌన్ మే 24వరకు తప్పదు..?

By:  Tupaki Desk   |   17 April 2020 8:10 AM GMT
బ్రేకింగ్: లాక్ డౌన్ మే 24వరకు తప్పదు..?
X
దేశంలోని ప్రజలందిరికీ ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగ - ఉపాధిపైనే బతుకుతున్న వారందరికీ గుండెలు గుబేల్ మనే వార్తనే. దేశంలో మే 24వరకు లాక్ డౌన్ కొనసాగించాలని వివిధ రంగాల నిపుణులు తాజాగా భారత దేశంతోపాటు రాష్ట్రాలకు - ఇతర దేశాలకు కూడా సలహా ఇచ్చారు. దీనికి గల కారణాలను వారు వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో మే 3వరకు లాక్ డౌన్ ను భారత ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలే పొడిగించారు. ఇక విదేశాల్లోనూ కఠినమైన లాక్ డౌన్ చాలా దేశాల్లో కొనసాగుతోంది. కానీ తాజాగా లాక్ డౌన్ పొడిగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 23నుంచి ప్రారంభం కానుంది. ముస్లింలు ఈ పవిత్ర మాసంలో ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి క్రమం తప్పకుండా మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. దీంతో సామూహికంగా బయటకు వస్తారు. ఇక ముస్లింలే కాదు.. సామాన్య హిందువులు - ఇతర మతస్తులు కూడా హలీమ్ సహా రంజాన్ వంటకాలను బహిరంగంగా.. రద్దీగా ఉండే హబ్ లలో.. హోటల్స్ లో - హైదరాబాద్ లోని వివిధ ప్రముఖ ప్రాంతాల్లో వెలిసే సెంటర్లలో తినడానికి ఇష్టపడతారు. దీంతో ఇది కరోనా వ్యాప్తికి దోహదపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలను కట్టడి చేస్తే మతకల్లోలాలకు దారితీసే ప్రమాదం ఉంది. అలా అని వదిలేస్తే కరోనా వ్యాపించడం ఖాయం.. రంజాన్ మాసం మే 23తో ముగుస్తుంది. ఈ నెల మొత్తం ముస్లింలు సామాజిక దూర నిబంధనలు అనుసరించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఇప్పటికే వివిధ ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేయాలని.. ఇంట్లో ఉండే ఉపవాసం చేయాలని.. ఇఫ్తార్ విందుల కోసం స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు ఇవ్వాలని ఇమామ్ - మౌలాలాలు పిలుపునిచ్చారు.

దీంతో దేశంలో కరోనా ముప్పును పరిగణలోకి తీసుకొని లాక్ డౌన్ ఖచ్చితంగా మే 24వరకు పొడిగించాలని నిపుణులు భారత్ తోపాటు ముస్లిం - గల్ఫ్ దేశాలకు సలహా ఇస్తున్నారు. ముస్లిం జనాభా ప్రపంచవ్యాప్తంగా బాగా ఉన్నందున ఈ లాక్ డౌన్ పొడిగిస్తేనే కరోనా కట్టడి చేయగలమని సూచిస్తున్నారు.