Begin typing your search above and press return to search.

ఆ హెల్మెట్ ఖరీదు జస్ట్ రూ.2.8 కోట్లేనట

By:  Tupaki Desk   |   17 Nov 2019 12:51 PM GMT
ఆ హెల్మెట్ ఖరీదు జస్ట్ రూ.2.8 కోట్లేనట
X
టూ వీలర్లు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న మాట ఎంత చెబుతున్నా.. దాన్ని ధరించకుండా ప్రమాదాలకు గురై.. ప్రాణాలు పోగొట్టుకునేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. ఇంతకీ హెల్మెట్ రేటు ఎంతంటే.. మన్నికగా ఉండే హెల్మెట్ రూ.వెయ్యికి వస్తుంది. సోకులతో ఉండే హెల్మెట్లు పది వేల నుంచి పాతిక వేల వరకూ మార్కెట్లో కనిపిస్తాయి.

కానీ.. ఇప్పుడు చెప్పే హెల్మెట్లు అలాంటి ఇలాంటివి కావు. దీని ధర వింటేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇన్నిమాటలు చెబుతున్నారు? ఇంతకీ రేటు ఎంతంటారా? సింఫుల్ గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పే హెల్మెట్ కు బదులుగా రెండు బెంజ్ కార్లు కొనుగోలు చేయొచ్చు. ధర ఎంతంటారా? జస్ట్ రూ.2.8 కోట్లు మాత్రమే.

ఏంది? హెల్మెట్ రేటు రూ.2.8కోట్లా? ఇంతకీ దీన్ని దేంతో తయారు చేస్తారేంది? బంగారంతో చేసినా ఇంత ఖర్చు పడదే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ హెల్మెట్ టూవీలర్ నడిపేందుకు కాదు.. అత్యంత ఖరీదైన.. వేగవంతమైన ఎఫ్-35 యుద్ధ విమానానికి వినియోగించే హెల్మెట్.

ఎంత యుద్ధ విమానం అయితే మాత్రం హెల్మెట్ కు అంత ఖరీదన్న అనుమానంగా ఉందా? ఎందుకంత రేటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. బోలెడంత ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఈ యుద్ధ విమానంలో వినియోగించే హెల్మెట్ చాలా ప్రత్యేకతల సొంతంగా చెబుతున్నారు.

ఈ విమానాన్ని నడిపే పైలెట్ల శరీరాన్ని త్రీడీ స్కాన్ చేస్తారు. ఆ డేటాను కొందరు నిపుణులకు పంపి.. వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సాఫ్ట్ వేర్ ను వినియోగించే ఫోమ్ లేనర్లను లేజర్ల సాయంతో కోస్తారు. ప్యూపిలోమీటర్ ను వినియోగించే పైలెట్ల కనుపాపను స్కాన్ చేస్తారు. కనుపాపకుకేవలం రెండు మిల్లీ మీటర్ల దూరంలో పైలట్లకు సమాచారాన్ని కపించేలా ఏర్పాట్లు ఉంటాయి.

ఎందుకిలా అంటారా? అత్యంత ఎత్తులో ప్రయాణిస్తూ.. వేగంగా దూసుకెళ్ల ఈ విమానంలో ప్రయాణం చేసే సమయంలో పైలట్ల శరీరం మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీని ప్రభావం వారి మెదడు మీద ఉంటుంది. అందుకే.. కంటిచూపు సమస్య లేకుండా ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విమానం కూలిపోయే సమయంలో అందులో నుంచి బయటకు వచ్చే సమయంలో గాయపడకుండా ఉండేలా ప్రత్యేకమైన మెటీరియల్ ను ఈ హెల్మెట్ కు వాడారు. తుపాకీతో కాల్చినా ఈ హెల్మెట్ కు ఏమీ కాదు. మెడకు ప్రత్యేకమైన గాయాలు కాకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు.

యుద్ధ విమానాల్లో ద్వారా దాడులు చేసే వేళ.. చీకటిపడితే పైలట్లు ప్రత్యేకమైన నైట్ విజన్ గాగుల్స్ వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఈ హెల్మెట్ ధరిస్తే అలాంటి అవసరం ఉండదు. ఈ హెల్మెట్ కున్న మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏమంటే.. దీనికి ఆరువైపులా కెమేరాలు అమర్చారు. ఏ వైపున ఎలాంటి కదలిక జరుగుతున్నా.. దానికి సంబంధించిన చిత్రాలు పైలెట్ కు కళ్ల ముందే జరుగుతున్న అనుభూతి కలిగేలా డిజైన్ చేవారు. అందుకే ఇంత ఖరీదు. ఒకవిధంగా చెప్పాలంటే అద్భుతానికి కేరాఫ్ అడ్రస్ గా ఈ హెల్మెట్ ను చెప్పకతప్పదు.