Begin typing your search above and press return to search.

షాకింగ్ : తెలంగాణకు 400 కి.మీ. దూరంలో మిడతల దండు!

By:  Tupaki Desk   |   27 May 2020 10:08 AM GMT
షాకింగ్ : తెలంగాణకు 400 కి.మీ. దూరంలో మిడతల దండు!
X
తెలంగాణ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మహమ్మారి తో దేశం మొత్తం అతలాకుతలం అవుతుండగా.. మిడతల ముప్పు ఇప్పుడు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత్‌ లోకి ప్రవేశించిన రాకాసి మిడతల దండు మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రాకాసి మిడతలు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంటకు నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో మిడతల దండు తెలంగాణ వైపు వస్తోంది.

మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని, అక్కడ నియంత్రణలోకి రాకపోతే అవి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతానికి ఈ మిడతల దండు రాష్ట్ర సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలంగాణ అధికారులు తెలిపారు. ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించేది లేనిది మరో రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు. ఈ మిడతలు తమ శరీర బరువుకు మించి ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి వెళ్లిన చోట పచ్చదనం మాయం అవుతుంది. పంటలకు తీవ్రం నష్టం వాటిల్లుతుంది. 35 వేల మందికి సరిపడే ఆహారాన్ని ఇవి ఒక్క రోజులో తినేస్తాయి. దీంతో ఈ మిడతలు తెలంగాణలో అడుగుపెడితే పరిస్థితి ఏంటని మహరాష్ట్ర సరిహద్దు జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు.