Begin typing your search above and press return to search.

మే చివరకల్లా ఇండియాలో కరోనా జీరో ! ?

By:  Tupaki Desk   |   16 April 2020 6:00 PM GMT
మే చివరకల్లా ఇండియాలో కరోనా జీరో ! ?
X
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ప్రాణాంతక వైరస్ కరోనాకు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. కరోనాకు చెక్ పడేదెప్పుడు? అదే సమయంలో లాక్ డౌన్ కు ముగింపు పలికేదెన్నడు? అన్న రెండు ప్రధానాంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఎవరికి తోచినట్టుగా వారు అంచనా వేస్తున్నా... ఇప్పటిదాకా లాజిక్ అంచనాలు ఏవీ రాలేదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి కరోనా పుట్టిన దేశం చైనాతో పాటు సదరు వైరస్ ప్రబలంగా వ్యాపించిన ప్రధాన దేశాల్లో వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ గడువులు, వైరస్ వ్యాప్తికి చెక్ పడిన సమయం, లాక్ డౌన్ కొనసాగిన కాలం... తదితరాలను క్రోడీకరిస్తూ ఓ లాజికల్ స్టడీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ స్టడీ ప్రకారం... మన దేశంలో కరోనా వ్యాప్తికి వచ్చే నెల(మే నెల) 10 నుంచి 20 తేదీల్లో చెక్ పడవచ్చని తెలుస్తోంది.

ఈ లాజికల్ స్టడీని సదరు నిపుణుడు... కరోనా జన్మస్థానం అయిన చైనా నుంచే మొదలుపెట్టాడు. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా చైనాతో పాటు ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలను చుట్టేసింది. చైనాలో జనవరి 22 నాటికి 571 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23న లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 4న ఒకే రోజు ఏకంగా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ దశను అతడు పీక్ స్టేజ్ గా పేర్కొన్నాడు. అంతేకాకుండా మార్చి 2వ తేదీకి చైనాలో కరోనా కేసులు జీరో స్థాయికి చేరుకున్నాయి. ఈ మొత్తం వివరాలను క్రోడీకరించిన సదరు నిపుణుడు... కరోనా విస్తరణ ప్రారంభమై ముగియడానికి ఏకంగా 3 నెలల సమయం పట్టిందని తేల్చేశాడు. అంతేకాకుండా చైనాలో ఉన్న 140 కోట్ల జనాభాలో ఈ వైరస్ 82,160 మందికి సోకి... 3,341 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ క్రమంలో చైనాలో కరోనా మరణాల శాతం 4గా నమోదైంది. కరోనా విస్తరణ దాదాపుగా ముగిసిందని భావించిన చైనా ప్రభుత్వం ఫిబ్రవరి తొలి వారంలోనే లాక్ డౌన్ ను ఎత్తివేసింది.

ఇక కరోనా విస్తరణకు సంబంధించి కూడా సదరు నిపుణుడు పక్కా అంచనా తీశారు. జీరో నుంచి తొలి వంద కేసులు నమోదు కావడానికి 50 రోజులు పడితే... 100 నుంచి వెయ్యి కేసులు నమోదు కావడానికి 6 రోజులు మాత్రమే పట్టింది. అదే సమయంలో వెయ్యి కేసుల నుంచి 10 వేల కేసులు నమోదు కావడానికి 8 రోజులు పట్టిందట. చైనాలో ఈ దశ కరోనాకు సంబంధించి పీక్ స్టేజీగానే భావించాలి. పీక్ స్టేజ్ కు చేరిన కరోనా వైరస్ ఆ తర్వాత క్రమంగా విస్తరణను తగ్గించుకుంది. పీక్ స్టేజ్ నుంచి కరోనా విస్తరణ జీరోకు పడిపోవడానికి ఏకంగా 15 రోజులు పట్టింది. మొత్తంగా కరోనా తన ప్రస్థానాన్ని ప్రారంభించి విశ్రమించడానికి ఏకంగా మూడు నెలల సమయం పట్టిందన్న మాట. ఇదే తరహాలో అతడు అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన గణాంకాలను కూడా విశ్లేషించారు. తేదీలు వేరేగా ఉన్నా.. కరోనా వైరస్ విస్తరణ, పీక్ స్టేజ్, జీరోకు చేరడం ఒకటి, రెండు రోజుల తేడా ఉన్నా చైనా మాదిరిగానే ఈ దేశాల్లోనూ కనిపించింది.

ఇక భారత్ విషయానికి వస్తే... భారత్ లోనూ కరోనా విస్తరణ జీరోకు చేరడానికి మూడు నెలల సమయం పడుతుందని చెప్పక తప్పదు. మన దేశంలో కాస్తంత లేటుగా కరోనా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 25న తొలి విడత లాక్ డౌన్ ను విధించిన కేంద్ర ప్రభుత్వం.. కరోనా విస్తరణ పీక్ స్టేజ్ కు చేరుకున్న తరుణంలో ఈ నెల 15 నుంచి మరో 19 రోజుల పాటు రెండో విడత లాక్ డౌన్ ను విధించింది. అంటే మన దేశంలో రెండో దశ లాక్ డౌన్ ముగిసే సమయానికి కరోనా విస్తరణ పూర్తి స్థాయిలో జీరోకు చేరదనే చెప్పాలి. అయితే లాక్ డౌన్ ను పొడిగించినా, లేదంటే లాక్ డౌన్ ను ఎత్తేసి ఆంక్షలు అమలు చేసినా... కరోనా విస్తరణ మాత్రం మే 10 నుంచి 20వ తేదీల మధ్యలో జీరో స్థాయికి చేరుకుంటుందన్న మాట. అప్పటిదాకా మనమంతా జాగ్రత్తగానే ఉండక తప్పదన్నది సదరు నిపుణుడి వాదన.